తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపడుతుండడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్ – 4 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. బుధవారం నాటికి దరఖాస్తుల సంఖ్య ఏకంగా 5 లక్షలకు చేరువైంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా కేవలం 18 రోజుల్లోనే 4,97,056 దరఖాస్తులు వచ్చాయి. ఇక దరఖాస్తుల స్వీకరణకు ఇంకా 11 రోజులు సమయం ఉండడంతో దరఖాస్తుల సంఖ్య 8 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అంచనావేస్తున్నారు.
ఇదిలా ఉంటే గ్రూప్ – 4 నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 8,039 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2, బీసీ వెల్ఫేర్‌లో 307, పౌర సరఫరాల శాఖలో 72, ఆర్థిక శాఖలో 255 మున్సిపల్, అర్బన్ డెవల్మెంట్ లో 2, 701 పోస్టులు, ఉన్నత విద్యా శాఖలో 742 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2,077 ఎస్సీ వెల్ఫేర్ లో 474 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే లేబర్ డిపార్ట్మెoట్ లో 128 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ లో 221 పోస్టులు, హోమ్ శాఖలో 133 పోస్టులు, పాఠశాల విద్యా శాఖలో 97 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణలో వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ వస్తోన్న టీఎస్‌పీఎస్‌సీ తాజాగా గ్రూప్ – 2 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 783 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. తొలిరోజే 15,405 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2కి కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..