హైదరాబాద్, జులై 19: తెలంగాణ డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల వివాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది. వివాదాల నడుమ డీఎస్సీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమైనప్పటికీ.. సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వనందున పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. మరోవైపు డీఎస్సీ పరీక్షకు, గ్రూప్ 2కి మధ్య వారం వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదా వేసేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లు నిరుద్యోగులకు తాజాగా హామీ ఇచ్చారు. గురువారం (జులై 18) బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో సమావేశమైన వీరు.. వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు తమ గోడును వెల్లడించారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలకు మధ్య చాలా తక్కువ వ్యవధి ఉందని వాపోయారు.
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలను మే, జూన్‌లో నిర్వహించాల్సి ఉంది. అభ్యర్థుల డిమాండ్ మేరకు డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించామన్నారు. అప్పటికే టీజీపీఎస్సీ పరీక్షలకు తేదీలు జారీ అయ్యాయని, అందువల్లనే డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయని ఎంపీ చామల వివరించారు. ఈ విషయంలో నిరుద్యోగులది న్యాయమైన డిమాండేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గ్రూప్ 2 వాయిదా వేసేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల సమయంలో చెప్పనిట్లుగానే యేటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
కాగా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో టీజీపీఎస్సీ గత ఏడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్ 2 వాయిదా పడింది. తాజాగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ల హామీ మేరకు మరోమారు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. పరీక్షలు వాయిదా పడినా.. నిరుద్యోగులు కోరుతున్నట్లు పోస్టులు సంఖ్య పెరుగుతుందో.. లేదో మాత్రం సర్కార్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాలి.