హైదరాబాద్, మే 19: తెలంగాణలో మొత్తం 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ త్వరలో ప్రారంభం కానుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను టీఎస్పీయస్సీ ప్రకటించించనుంది. గ్రూప్ 4 ఫలితాలను ఈ ఏడాది ఫిబ్రవరి 9న ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 1 : 3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే దివ్యాంగ కేటగిరీలో 1 : 5 నిష్పత్తిలో జాబితా ప్రకటించనుంది. ఇందుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అవసరమైన సర్టిఫికెట్లన్నింటినీ సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. క్యాస్ట్ సర్టిఫికెట్, బీసీ నాన్ క్రీమీలేయర్, వికలాంగ ధ్రువీకరణ సర్టిఫికెట్, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021-22 ఏడాదికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌తోపాటు మిగతా అన్నీ అవసరమైన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. సంబంధిత అన్ని సర్టిఫికెట్లను పరిశీలన సమయంలో తప్పనిసరి సమర్పించాలని, అదనంగా ఎవరికీ గడువు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ జిల్లా స్థాయిలోనా.. లేక రాష్ట్ర స్థాయిలోనా అనే విషయమై టీఎస్‌పీఎస్సీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఒకవేళ కమిషన్ 1 : 3 నిష్పత్తి చొప్పున మెరిట్ జాబితాలో వెల్లడిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 25 వేలకుపైగా అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వస్తారు. రాష్ట్ర స్థాయిలో పరిశీలనకు పిలిస్తే అందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. అలాగని.. జిల్లా స్థాయిలో పరిశీలన బాధ్యతలు అప్పగిస్తే పొరపాట్లు జరిగితే అవకాశం లేకపోలేదు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కమిషన్ మల్లగుల్లాలు పడుతోంది. అయితే కొంత ఆలస్యమైనా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కమిషన్ భావిస్తోంది. ఆ దిశగా కార్యచరణ రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందువల్లనే రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేయాలని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇందుకు అవసరమైన సిబ్బందిని ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకుని.. ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.