హైదరాబాద్, మే 12: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు మే 25 వరకు అవకాశం ఇచ్చినట్లు మోడల్ స్కూళ్ల అడిషనల్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
సీట్లు పొందిన విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా భోధన అందిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ.. గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రూపులో 40 సీట్లు ఉంటాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్ విదానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాల కోసం మోడల్ స్కూళ్ల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్ధులు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా గురుకులాల్లో సీట్లు కేటాయిస్తారని సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణ కుమార్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫలితాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఎంపికైన విద్యార్థుల జాబితాను రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.