
హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం (ఫిబ్రవరి 29) విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924 పోస్టుల భర్తీకి గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక ఎంపిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. జేఎల్ రాత పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది లింక్‌ల ద్వారా నేరుగా ఫలితాను చెక్ చేసుకోవచ్చు. కాగా గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జూనియర్ లెక్చరర్ పోస్టులకు రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన ఫలితాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది.
తెలంగాణ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. మొత్తం 22 సబ్జెక్టులకు గానూ ఈ పరీక్ష నిర్వహించింది. సబ్జెక్టుల వారీగా జాబితాలను అధికారిక వెబ్‌సైట్‌లో బోర్డు పొందుపరిచింది. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల డిగ్రీ కాలేజీల్లో 793 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది. సంక్షేమ గురుకులాల్లో 1924 జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలను కూడా గురువారం బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు కసరత్తు పూర్తిచేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.