
హైదరాబాద్, మే 26: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక అప్‌డేట్ జారీ చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో తుది అంకం మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి తాజాగా 777 మందితో కూడిన మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఇందులో స్పోర్ట్స్ కోటాలో ఇద్దరికి చోటు దక్కింది. 1:1 నిష్పత్తిలో 777 మంది అభ్యర్థుల ఎంపిక చేయగా.. వారికి మే 29 నుంచి జూన్ 10 వరకు నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. ఈ మేరకు గ్రూప్ 2 అభ్యర్ధులకు తెలియజేస్తూ కమిషన్ ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఆయా తేదీల్లో అభ్యర్ధులు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావల్సి ఉంటుంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో ఎవరైనా సంబంధిత పత్రాలు సమర్పించకపోతే.. సదరు పెండింగ్ సర్టిఫికెట్ల సమర్పనకు జూన్ 11న రిజర్వుడు డేగా నిర్ణయించినట్లు తెలిపింది. అయితే జూన్ 11 సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలాంటి ధృవీకరణ పత్రాలు తీసుకోబోమని స్పష్టం చేసింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులందరూ మే 27 నుంచి జూన్ 11 సాయంత్రం 5.30 గంటల వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైబ్‌లో తప్పనిసరిగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవల్సి ఉంటుంది.
ఈ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జాగ్రత్తగా చేయాలని, అనంతరం తుది ఎంపికలకు పరిశీలిస్తామని కమిషన్ వెల్లడించింది. ఇక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో 8 సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు మే 26న ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గ్రూప్ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు గైర్హాజరైనా, వెబ్‌ఆప్షన్లు నమోదు చేయకపోయినా.. అటువంటి అభ్యర్ధుల అభ్యర్ధిత్వాన్ని రద్దు చేసి, తదుపరి స్థానంలో తదుపరి మెరిట్ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.