హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 విభాగాల్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్షలు ఎట్టకేలకు నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. రెండు రోజుల పాటు జరిగే పరీక్షలు మొత్తం నాలుగు పేపర్లకు ఉంటాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. డిసెంబరు 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1 (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్), అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 (హిస్టరీ, పాలిటీ, సొసైటీ) పరీక్ష జరుగుతుంది. డిసెంబరు 16న ఉదయం సెషన్‌లో పేపర్ 3 (ఎకానమీ, డెవలప్‌మెంట్) పరీక్ష, మధ్యాహ్నం సెషన్‌లో పేపర్ 4 (తెలంగాణ ఉద్యమం, ఏర్పాటు) పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు పరీక్ష తేదీకి సరిగ్గా వారం రోజుల ముందు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెల్లడించారు. నిజానికి రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ వెలువడినప్పటికీ.. ఇప్పటి వరకు గ్రూప్ 2 పరీక్ష జరగకపోవడం తెలిసిందే.
తెలంగాణ గ్రూప్-2 సర్వీసుల్లో 783 ఉద్యోగాలకు 2022లో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన కొద్ది రోజులకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఒక వైపు గురుకుల టీచర్ ఉద్యోగాల పరీక్షలు, మరో వైపు గ్రూప్ 2 పరీక్షలు వరుసగా ఉండటంతో సన్నద్ధం కాలేకపోతున్నామని, సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో అప్పటి తొలిసారి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. ఆ తర్వాత 2023 నవంబరు 2, 3 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది.
అయితే ఇవే తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రెండో సారి వాయిదా పడ్డాయి. మరోసారి 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్ష తేదీలు మారాయి. ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీకి కొత్త బోర్డును ఏర్పాటు చేసి, రాత పరీక్షల తేదీలను మూడోసారి మార్చింది. ఆగస్టు 7, 8 తేదీలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల నేపథ్యంలో మూడోసారి కూడా పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేయడంతో డిసెంబరులో నిర్వహిస్తామని తాజాగా వెల్లడించింది. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు సర్కార్ ముందుకొచ్చింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.