AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Govt Jobs: ‘త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’.. సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. యువతలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వారికి నైపుణ్య శిక్షణ అందించేందుకు..

TG Govt Jobs: 'త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'.. సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy
Srilakshmi C
|

Updated on: Aug 27, 2024 | 2:07 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 27: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. యువతలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వారికి నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నైపుణ్యాల విశ్వవిద్యాలయానికి చైర్‌పర్సన్‌గా ఉండేందుకు అంగీకరించారని తెలిపారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో దేశ ప్రదర్శన ప్రజల అంచనాల కంటే తక్కువగా ఉందని, 2028 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా తెలంగాణ క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తోందన్నారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్‌ ఇండియా వర్సిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నామని, వచ్చే ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

సివిల్స్ అభ్యర్ధులకు రూ.లక్ష ఆర్థిక సాయం

యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్‌ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ కింద లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థులకు రేవంత్‌రెడ్డి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్‌ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సివిల్స్‌ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని, అయితే పిల్లలను పౌల్ట్రీ ఫారాల కంటే అధ్వాన్నంగా ప్రైవేట్ భవనాల్లో ఉంచినట్లు ఆరోపించారు. ఆయా పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5,000 కోట్లతో రాష్ట్రంలో 100 ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను’ ఏర్పాటు చేస్తోందని చెప్పారు.

‘రాజకీయ లబ్దికోసం నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదు’

రాష్ట్రంలోని యూనివర్సిటీలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలహీణపరిచిందని, మరో 10-15 రోజుల్లో అన్ని వర్సిటీలకు వీసీలను నియమిస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం ప్రొఫెసర్లు, ఇతరత్రా ఖాళీలను భర్తీ చేస్తుందని చెప్పారు. కేసీఆర్‌ సర్కార్ గత పదేళ్లలో రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించలేదన్నారు. కానీ ఇప్పుడు వాళ్లు నిరుద్యోగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పోటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జరుగుతున్న నిరసనల గురించి ప్రస్తావిస్తూ.. రాజకీయంగా తమకు అనుకూలం కాదని కొందరు పోటీ పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని అన్నారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు చెప్పేది వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారు ఎలాంటి నిరసనలకు దిగాల్సిన అవసరం లేదని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us