హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా.. పరీక్షల నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 32 వేల మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు నిర్వహించడానికి ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఆన్సర్ షీట్ల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. పరీక్షలను హైదరాబాద్ పరిధిలో నిర్వహించే అవకాశం ఉంది.
అయితే గ్రూప్ 1 మెయిన్ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఆంగ్ల భాషలో కూడా డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు టీ-శాట్ సీఈవో బోధనపల్లి వేణుగోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాసే అభ్యర్థులకు ‘క్రాష్ కోర్స్-100’ పేరిట అర్ధ గంట నిడివి గల పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 20వ తేదీ వరకు ఈ పాఠ్యాంశాలను ప్రసారం చేస్తామని తెలిపారు. ఈ పాఠ్యాంశాలు టీ-శాట్ నిపుణ ఛానెల్‌లో ఆయా రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసారమవుతాయని, తిరిగి అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో విద్యా ఛానెల్‌లో అవే అంశాలు పునఃప్రసారమవుతాయని వివరించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
కాగా తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షలకు ఇప్పటికే అభ్యర్ధులు ముమ్మరంగా సన్నద్ధం అవుతున్నారు.