హైదరాబాద్, జనవరి 9: మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో కసరత్తు చేస్తామని, కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తాజాగా గ్రూప్-3 ‘కీ’ విడుదల చేశామని, రెండ్రోజుల్లో గ్రూప్ 2 ‘కీ’ కూడా విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్ 1, 2, 3 ఫలితాలు కూడా విడుదల చేస్తామన్నారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ ఫార్మాట్‌లలో పరీక్షల నిర్వహణ చేపట్టనున్నట్లు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మార్చి 31లోపు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలన్నీ విడుదల చేస్తా్మన్నారు.
ఏ పరీక్ష ఫలితాలు కంప్లీట్ అయితే అవి ముందుగా ఇచ్చేస్తామన్నారు. గతంలో మాదిరి ఫలితాల విడుదలలో జాప్యం చేయకుండా త్వరగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. టీజీపీఎస్సీ సిలబస్ పై అధ్యయనం చేస్తున్నామని, గ్రూప్ -3కు మూడు, నాలుగు పేపర్లు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ విడుదల చేయగా.. మొత్తం 171 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు జాబితాలో వెల్లడించింది. ఈ పోస్టుల భర్తీకి 2023 జులైలో రాత పరీక్ష నిర్వహించగా అక్టోబరు 21 నుంచి 24, డిసెంబర్ 5, 6, 7, 23 2024, తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టింది. తాజాగా తుది ఫలితాలు వెల్లడించింది.
TGPSC టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.