TGCHE: ఇకపై ఆన్సర్‌ కీపై చాలెంజ్‌కు ఫీజుగా రూ.500 కట్టాల్సిందే.. విద్యార్ధుల నెత్తిన గుదిబండ వేసిన ఉన్నత విద్యామండలి!

ఇంజినీరింగ్‌ సహా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంతో విద్యార్ధులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంట్రెన్స్‌ టెస్టుల అనంతరం విడుదలయ్యే ఆన్సర్‌ కీపై చాలెంజ్‌ చేస్తే ఒక్కో ప్రశ్నకు రూ. 500 చొప్పున ఫీజుగా వసూలు చేయాలని నిర్ణయించింది..

TGCHE: ఇకపై ఆన్సర్‌ కీపై చాలెంజ్‌కు ఫీజుగా రూ.500 కట్టాల్సిందే.. విద్యార్ధుల నెత్తిన గుదిబండ వేసిన ఉన్నత విద్యామండలి!
Challenges In Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 04, 2025 | 12:15 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4: ప్రవేశ పరీక్షల విషయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ అనంతరం వెలువరించే ఆన్సర్ కీలపై అభ్యంతరాలు తెలపాలంటే జేబుకు చిల్లుపడేలా నిబంధనలు తీసుకువచ్చింది. రాష్ట్రంలో నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్టుల్లో ప్రాథమిక ఆన్సర్‌ కీపై చాలెంజ్‌ చేస్తే ఒక్కో ప్రశ్నకు రూ. 500 చొప్పున ఫీజుగా వసూలు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇలా ఒక విద్యార్థి 10 ప్రశ్నల ఆన్సర్లను సవాల్‌చేస్తే అక్షరాలా రూ. ఐదు వేలు సమర్పించుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా ఆల్‌ ఇండియా లెవెల్‌లో నిర్వహించే జేఈఈ, నీట్‌ వంటి పరీక్షల్లో ఆన్సర్‌ కీ చాలెంజ్‌కు ఒక్కో ప్రశ్నకు కేవలం రూ. 200 మాత్రమే వసూలు చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆన్సర్ కీపై ఒక్కో ప్రశ్నకు రూ. 500 వసూలు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఒక వేళ ఎవరైనా మొత్తం 200 ప్రశ్నల్లో 150 ప్రశ్నలను సవాల్‌చేయాలనుకుంటే ఏకంగా రూ. 75 వేలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇలా 100 ప్రశ్నలకు రూ.50 వేలు చెల్లించవల్సి ఉంటుంది. నిజానికి, గతంలో ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేసేందుకు ఎలాంటి ఫీజులు వసూలు చేసేవారు కాదు. ఏ పరీక్ష ఆన్సర్‌ కీపై అయినా ఒక్క రూపాయి కూడా వసూలు చేసే విధానం ఇది వరకెప్పుడు అమలులో లేదు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రవేశ పరీక్షలకు అమలుచేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకోవడం విద్యార్ధులకు సంకటంగా మారింది.

ఇప్పటికే ఈఏపీసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌ సహా 7ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌. వీటిల్లో కొన్నింటికి షెడ్యూళ్లు కూడా ఖరారు చేశారు. ఒకవేళ ఈ విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే.. విద్యార్ధులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది పూర్తిగా రీ ఫండబుల్‌ ఫీజు. అంటే ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో ఆన్సర్‌ తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అదే ఆన్సర్‌ మారకపోతే ఫీజు వాపస్‌ ఉండదు.  విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే ఈవిధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్రంలోని పలు విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.