Free Coaching for Bank Exams: బ్యాంకు పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే
వేలకు వేలు పెట్టి కోచింగ్ తీసుకుని బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపరేషన్ చేయలేని వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. ఆశావహ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని తన ప్రకటనలో తెలిపింది. మరో 4 రోజుల్లో దరఖాస్తు గడువు ముగుస్తుంది..
హైదరాబాద్, అక్టోబర్ 22: ఇటీవల పలు బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఐబీపీఎస్ క్లర్క్, ప్రొబేషనరీ వంటి తదితర బ్యాంకు అధికారుల ఎంపికకు విడుదలైన వరుస నోటిఫికేషన్లకు ఉద్యోగార్ధులు పోటాపోటీగా ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇక మరోవైపు పోటీ పరీక్షల కోసం గిరిజన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 60 రోజుల ఉచిత శిక్షణకు దరఖాస్తు కోరుతూ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తుది గడువు అక్టోబరు 27 వరకు పొడిగించినట్లు గిరిజన సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో అర్హులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు గిరిజన స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కోరింది. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3.5 లక్షలకు మించకూడదని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలకు 040-27540104 ఫోన్ నంబరును సంప్రదించాలని తన ప్రకటనలో సూచించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య శాఖలోకి పల్నాడు ఏపీఆర్‌డీసీ కాలేజీ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నాగార్జున సాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య శాఖలోకి మార్చేందుకు రాష్ట్ర సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డిగ్రీ కళాశాల భవనాలు, భూములు, రికార్డులతో సహా అన్నింటిని పాఠశాల విద్యాశాఖ నుంచి ఉన్నత విద్యాశాఖకు మార్చేందుకు ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీనిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఏపీ రెసిడెన్షియల్ విద్య సంస్థల సొసైటీ కార్యదర్శి నరసింహారావు సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
మచిలీపట్నం మెడికల కాలేజీకి పింగళి వెంకయ్య పేరు
మచిలీపట్నంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబరు 21న కాలేజీ పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.