
హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్ 2025) నోటిఫికేషన్ ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడ ప్రారంభమైంది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు అక్టోబర్ 30, 2025వ తేదీతో ముగిసింది. అయితే తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఉస్మానియా వర్సిటీ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు నవంబర్ 6వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు దరఖాస్తు స్వీకరణ గడువును పొడగించినట్లు సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు.
సెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పీజీలో కనీసం 55 శాతం మార్కులతో సంబంధి సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ ఆఖరు సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. రూ.1500 ఆలస్య రుసుముతో నవంబర్ 14వ తేదీ వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో నవంబర్ 19వ తేదీ వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో నవంబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక నవంబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తెలంగాణ సెట్ పరీక్షలు డిసెంబర్ నెల రెండో వారం నుంచి ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఇతర వివరాలకు 0040-27097733, 8331040950 నెంబర్లను సంప్రదించాలని సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి శ్రీనివాస్ సూచించారు.
తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్, అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.