telangana school reopen from tomorrow: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండు విద్యా సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 13న పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. 2020-21లో 2 (ఫిబ్రవరి, మార్చి) నెలలు మాత్రమే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి తరగతులు ప్రారంభమైనా 50 శాతం మంది విద్యార్థులే ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకోవడంతో ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 13వ తేదీ (సోమవారం) నుంచి విద్యాసంస్థలు ఓపెన్ కానుండటంతో పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా..? లేదా..? అనే చర్చ నడుస్తోంది. కొన్ని రోజులు సెలవులు పొడిగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు క్లారిటీ ఇచ్చారు.
‘ప్రత్యక్ష బోధనకు, ఆన్‌లైన్ బోధనకు చాలా తేడా ఉంటుంది. గురుకులాల్లో 4 లక్షల మంది, కస్తుర్భా స్కూళ్లలో 2 లక్షల మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 60 లక్షలకు పైగా విద్యార్ధులు చదువుతున్నారు. వీరందరికి రేపట్నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. మన ఊరు-మన బడికి సంబంధించి 9వేల స్కూళ్లలో వర్క్ జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ (1-8) మీడియం ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక నెలపాటు బ్రిడ్జికోర్సు నిర్వహించాలి. విద్యార్థుల సౌలభ్యం కోసం కోటి 64 లక్షల బైలింగ్వల్ బుక్స్ ప్రింట్ చేశారు. ప్రైవేట్ స్కూళ్ల మాదిరి, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులు పదిరోజులకోసారి, టీచర్లను సంప్రదించి విద్యార్థుల చదువు, పురోగతిపై సంప్రదించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని, చాలా కాలం తర్వాత విజయవంతంగా స్కూళ్లను ప్రారంభిస్తున్నాం.. కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా రేపు స్కూళ్ల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులకు ఈ మేరకు సూచించారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వైద‍్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 10 ఒక్కరోజే 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఐతే శనివారం మాత్రం 145 కేసులు నమోదయ్యాయి. మొత్తం 145 కేసుల్లో 117 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్‌లో 81 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల్లో హైదరాబాద్‌లో కేసుల సంఖ్య 100 దాటడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఆసుపత్రుల్లో 977 మంది వైద్యం చేయించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజు 15,200ల శాంపిళ్లను టెస్ట్ చేశారు. కరోనా ప్రారంభమయినప్పటినుంచి ఇప్పటివరకు 4,111ల మంది మృతి చెందినట్లు రికార్డులు తెల్పుతున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.