సిద్ధిపేట: ‘ప్లీజ్.. మీ స్కూల్‌లో మాకు ఒక్క అడ్మిషన్ ఇవ్వండి.!’ ఇది కార్పోరేట్ స్కూళ్లలో వినబడే మాట ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో వినిపిస్తున్నది. అదెక్కడో కాదు. సిద్ధిపేట పట్టణంలోని ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్‌లో.. ఇది కేవలం ఈ యేడాదే కాదు. ఎనిమిదేళ్ల నుంచి ఇదే తంతు జరుగుతున్నది..మంత్రి హరీష్ రావు దత్తత పాఠశాలలో విద్య, విజ్ఞానం, పోటీతత్వంలో.. కార్పోరేట్‌కు ధీటుగా ఉండడంతో.. ఈ నో అడ్మిషన్ల బోర్డు ప్రతి విద్యా సంవత్సరం కనిపిస్తున్నది. ‘నో అడ్మిషన్లు’ అనే బోర్డు ఏర్పాటు చేయాల్సి వస్తోంది..‘మాకు ఒక్క సీటు ఇప్పించండి సారూ’.. అంటూ వందలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజూ ఆ పాఠశాలకు క్యూ కడుతున్నారు..ఉన్నవి 160 సీట్లు మాత్రమే. కానీ, వందల మంది పేరెంట్స్ క్యూ.
ఇలా ప్రతీ యేటా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే జరుగుతోంది. ఎనిమిదేండ్ల క్రితం 300 మంది విద్యార్థులున్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో క్రమక్రమంగా సీట్లు పెంచుతున్నా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 2022-24 విద్యా సంవత్సరానికి 1195 విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఆ పాఠశాలకు ఇప్పటికే అన్ని తరగతుల్లో సీట్లు నిండిపోయాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్న ఈ పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల్లో నాలుగు సెక్షన్లు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల్లో ఐదు సెక్షన్ల చొప్పున తరగతులు బోధిస్తున్నారు. 1195 మంది విద్యార్థుల సామర్థ్యం గల ఈ పాఠశాలలో మొత్తం 23 సెక్షన్లుగా విభజించి తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ సెక్షన్లు పెరుగుతున్నాయి.
ఆరో తరగతిలో ప్రవేశాలకు 180 సీట్లు ఉండగా, 400కు పైగా దరఖాస్తులు వచ్చాయంటే, ఈ పాఠశాలలో సీటుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 7వ, 8వ, 9వ, 10వ తరగతుల్లో అడ్మిషన్లు నిండిపోగా,ఆరో తరగతిలో దరఖాస్తుల కోసం రోజూ వందల మంది తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కడుతున్నారు.
విద్యార్థులకు ఇంగ్లీషులో కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపర్చేలా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇఫ్లూ తరగతులను కూడా నిర్వహిస్తున్నది. యూనివర్శిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్‌లో భాగంగా ఇంగ్లీషు అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఎఫ్‌ఎల్‌యు) ఇక్కడి ఇందిరా నగర్ పబ్లిక్ స్కూల్‌ను దత్తత తీసుకుని హైస్కూల్ విభాగంలోని విద్యార్థులకు ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్ భాషలను బోధిస్తున్నది. ఇఫ్లూ ప్రతీ వారంలో రెండు రోజులు ఆన్ లైన్, ఒక్కరోజు ఆఫ్ లైన్ తరగతులు ఉంటున్నాయి. ఇంగ్లీషు కమ్యూనికేషన్ కై 3 బ్యాచ్ లలో 30 మంది విద్యార్థులు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఇలా 3 నెలల్లో 90 మంది శిక్షణ నిర్వహిస్తూ యేడాదిలో 270 మంది శిక్షణ పూర్తి చేస్తున్నారు. ఇకపోతే 9వ, 10వ తరగతి స్పానిష్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకోవాలని ఆసక్తి చూపుతూ ప్రతియేటా 90 మంది ఎంపిక అవుతున్నారు. ఇటీవల ఈఎఫ్‌ఎల్‌యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఈ.సురేష్ కుమార్ ఇందిరా నగర్ పాఠశాల ఉపాధ్యాయులతో ఎంఓయూ కుదుర్చుకున్నది. ఈ మేరకు 150 మంది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు, అనంతరం విద్యార్థులను హైదరాబాద్‌లోని ఈఎఫ్‌ఎల్‌యూ క్యాంపస్‌కు తీసుకెళ్లి ఫిజికల్ క్లాసులు నిర్వహణ చేస్తున్నారు.
మంత్రి స్పెషల్ ఫోకస్ తో పదవ తరగతి విద్యార్థులకు క్యూ ఆర్ కోడ్ బుక్స్ అందించారు. దీనికి తోడు పది మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయురాలిని ప్రత్యేకంగా నియమించి పదిపై దృష్టి పెట్టారు. దీంతో 99 శాతం విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించి అటు తల్లిదండ్రులు, మంత్రి పేరు, ఇటు పాఠశాల పేరును నిలబెట్టారు. కష్టపడి చదివి బాసర ఐఐఐటీలో సిద్ధిపేట ఇందిరానగర్ హైస్కూల్ విద్యార్థులు 32 మంది ఎంపికై ప్రభంజనం సృష్టించారు. అలాగే 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు (ఏన్ఏంఏంఏస్-నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్) 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి 9వ, 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ప్రతీ యేటా 12 వేల చొప్పున నాలుగేళ్లు రూ.48 వేల స్కాలర్ షిప్ అందుతుంది.
అయితే ఇటీవల పదవ తరగతిలో సైతం ఈ పాఠశాల నుంచి 6 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు…మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఇందిరానగర్ జెడ్పీ ప్రభుత్వ పాఠశాలకు అన్ని రకాల సదుపాయాలను సమకూర్చారు..పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయ బృందం సమష్టి కృషితో విద్యార్థులలో సత్ఫలితాలు వస్తున్నాయి. పాఠశాల భవనాన్ని పునరుద్ధరించడంతో పాటు నాట్కో సంస్థ సహకారంతో ఆరు అదనపు తరగతి గదులు నిర్మించారు. అంతే కాకుండా పాఠశాలలో డిజిటల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ కోసం భవనం, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సదుపాయం, సోలార్ పవర్ యూనిట్, మోడల్ వంటశాల, వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. పాఠశాలలోని ప్రతి తరగతి సీసీ కెమెరాలకు అనుసంధానం చేసి ఉంది. ఈ పాఠశాలలో ప్రతి రికార్డు ఆన్‌లైన్‌లోనే నిక్షిప్తం చేసి ఉంచుతారు…
జాతీయ స్థాయిలో యేటా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో జరిగే సెమినార్లకు ఈ పాఠశాలకు ఆహ్వానం వస్తుంది. 2017 నుంచి జాతీయ స్థాయిలో విద్యారంగంపై జరిగిన సెమినార్లలో గత హెచ్‌ఎం రామస్వామి, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి పాల్గొని, పాఠశాల అభివృద్ధి, ఇన్నోవేటివ్, లీడర్‌షిప్ తదితర అంశాలపై వివరిస్తారు. ఇంకా రాష్ట్రస్థాయిలో ఇందిరానగర్ పాఠశాలకు 5 అవార్డులు వరించాయి. ఇవే కాకుండా జిల్లా స్థాయిలో చాలా అవార్డులు వచ్చాయి…
ఇందులో తమ పిల్లలకు సీట్ కావాలని మంత్రి హరీష్ రావు దగ్గరికి సైతం వెళ్తున్నారట కొంతమంది తల్లిదండ్రులు.. కొన్ని సందర్భల్లో మంత్రి చెప్పిన కూడా సీట్ దొరకడం లేదట ఇందులో..దీనితో పాటు సిద్దిపేట జిల్లాలో ఉన్న 22 కేజీబివి పాఠశాలలో ఇప్పటికే 17 పాఠశాలల్లో సీట్లు ఫుల్ ఆయ్యాయి..ప్రస్తుతం ఈ 17 పాఠశాలల ముందు కూడా అడ్మిషన్లు ఫుల్ అనే బోర్డులు ఉన్నాయి…
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.