హైదరాబాద్, జనవరి 7: తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటన జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియగా.. రూ. 2,500 అపరాధ రుసుముతో జనవరి 16వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. కాగా ఇప్పటికే ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.
తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 5వ తేదీ నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి, ఆ మరుసటి రోజు అంటే మార్చి 6వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు జరుగనున్నాయి.