హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు డిసెంబర్ 25 తేదీతో ఫీజు చెల్లింపు గడువు ముగియగా.. తాజాగా ఆ గడువును డిసెంబర్ 31 తేదీ వరకు పొడగించారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. కాగా ఇప్పటికే ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 5వ తేదీ నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి, ఆ మరుసటి రోజు అంటే మార్చి 6వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు జరుగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షకు 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసి, మరోసారి ఫలితాలు విడుదల చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. ఈ మేరకు మెయిన్స్‌కు అభ్యర్ధులను ఎంపిక చేయాలని కోరుతూ డిసెంబరు 24న విజయవాడలోని కార్యాలయంలో ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ అనురాధను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ బైపీసీ విభాగంలో ఫార్మసీ, ఇంజినీరింగ్ తుది విడత కన్వీనర్ కోటా ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తైంది. మొత్తం 82.26 శాతం సీట్లు భర్తీ అయినట్లు కన్వీనర్ గణేష్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 229 ఇంటజనీరింగ్ కాలేజీలు ఉండగా.. వీటిల్లో మొత్తం 12,701 సీట్లు ఉండగా.. వాటిల్లో 10,449 భర్తీ అయ్యాయని తెలిపారు. ఇంజినీరింగ్‌లో 423 సీట్లకు 312, బీ-ఫార్మసీలో 10,612 సీట్లకు 8,482, ఫార్మాడీలో 1666 సీట్లకు గాను 1655 సీట్లు భర్తీ అయినట్లు తెలిపారు. కోర్సులు, కళాశాలల మార్పు కోసం 1675 మంది స్లైడింగ్ తీసుకున్నట్లు వివరించారు.