హైదరాబాద్, ఫిబ్రవరి 28: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (ఫిబ్రవరి 28) నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరంలో 4,78,718 మంది విద్యార్ధులు, రెండో సంవత్సరంలో 5,02,260 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.
ఇంటర్ పరీక్షల్లో ఎవరైనా కాపీ కొట్టినా, ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా అటువంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కాపీయింగ్ పాల్పడిన విద్యార్థిని డిబార్ చేయడంతో పాటు డ్యూటీలో ఉన్న అధికారులపై, సంబంధిత కేంద్రం యాజమాన్యం పైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలని అధికారులకు బోర్డు సూచించింది. కాగా ఈ రోజు నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా తమతోపాటు హాల్ టికెట్లను తీసుకెళ్లాలని కరీంనగర్ జిల్లా ఇంటర్ విద్యాధికారి జి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. హాల్‌టికెట్ల పొందని విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని తమతోపాటు తీసుకెళ్లాలని సూచించారు. అయితే హాల్ టికెట్లపై కళాశాలల ప్రిన్సిపాళ్ల సంతకం లేకున్నా పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. ప్రత్యేక స్క్వాడ్, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులకు ఇబ్బంది కలక్కుండా చూడాలని పొన్నం ప్రభాకర్ RTC అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు బస్సు అపమన్న చోట ఆపాలని, సెంటర్ల వద్ద బస్సు ఎక్కే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసి అధికారులకు సూచించారు. పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. రేపటి భవిష్యత్ పునాది ఇంటర్మీడియట్ కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు చూపిస్తే మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అయన అన్నారు. ఇన్ని రోజులు కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్షల్లో దానిని సవ్యంగా రాయడమే ప్రధానమని, అందుకే చాలా జాగ్రత్తగా పరీక్షలు రాయాలన్నారు. పరీక్షలు రాసే ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.