TS Inter Supply Exams 2025: నేటి నుంచే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం (మే 22) నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా ఇంటర్‌ బోర్డు జారీ చేసింది. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య తెలిపారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన..

TS Inter Supply Exams 2025: నేటి నుంచే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే!
Inter Supply Exams

Updated on: May 22, 2025 | 6:18 AM

హైదరాబాద్‌, మే 22: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం (మే 22) నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా ఇంటర్‌ బోర్డు జారీ చేసింది. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య తెలిపారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లోను ఐదు నిమిషాల సడలింపునిచ్చిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌ విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ఇక సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

సమయం విషయంలో బోర్డు తాజా సడలింపుతో ఉదయం 9.05 గంటలు, మధ్యాహ్నం 2.35 గంటల వరకు విద్యార్ధులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వారిని మాత్రం పరీక్షకు అస్సలు అనుమతించబోమని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఈ రోజు ప్రారంభం కానున్న పరీక్షలు మే 29 వరకు జరగనున్నాయి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2లక్షల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య వెల్లడించారు.

ఇక పరీక్షల అనంతరం ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని రెండు విడతల్లో చేపట్టనున్నారు. మే 29 నుంచి మొదటి విడత ప్రారంభం అవుతుంది. మే 31 నుంచి రెండో విడత మూల్యాంకనం ప్రారంభమవుతుంది. మరోవైపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల దరఖాస్తు గడువును మరొక రోజు పొడిగిస్తూ ప్రకటన జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.