హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఇంజినీరింగు, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘టీఎస్‌ఈఏపీసెట్-2024’కి ఫిబ్రవరి 26 నుంచి అన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 3,113 దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీరింగుకు 1,983, వ్యవసాయం – ఫార్మసీకి 1,130 చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంటుంది. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ. 500 ఆలస్యం రుసుంతో ఏప్రిల్ 14వ తేదీ వరకు, రూ. 2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు, రూ. 5000 ఆలస్య రుసుంతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో ఇప్పటికే కన్వినర్ డాక్టర్ బి డీన్ కుమార్ వెల్లడించారు. మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సులకు, మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సులు, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు.
తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్ల నియామకాలకు నిర్వహించిన రాత పరీక్షలో షార్ట్‌లిస్టుకు ఎంపికైన అభ్యర్థులందరికీ ధ్రువపత్రాల పరిశీలన ఫిబ్రవరి 29న చేపట్టనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 27న (మంగళవారం) ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్(బీఈడీ) తుదివిడత కౌన్సెలింగ్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కన్వీనర్ విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు వెబ్ కౌన్సెలింగ్ నమోదు, ఫిబ్రవరి 29 నుంచి మార్చి 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. వెబ్ ఐచ్ఛికాలు మార్చి 2 నుంచి 5 వరకు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మార్చి 6న వెబ్ ఆప్షన్ల మార్పుకు అవకాశం కల్పించారు. సీట్ల కేటాయింపు మార్చి 9న చేయనున్నట్లు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు మార్చి 11 నుంచి సంబందిత కాలేజీల్లో చేరాల్సిందిగా తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ – యూజీ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరీక్షను హైబ్రిడ్ పద్ధతి (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. కొన్ని కేంద్రాల్లో ఆన్‌లైన్ (సీబీటీ), మరికొన్నింటిలో పేపర్, పెన్ను (ఆఫ్‌లైన్) విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈ సారి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పించారు. సీయూఈటీ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 26 అర్ధరాత్రి 11.50 గంటల వరకు స్వీకరించనున్నారు. ఇక ప్రవేశ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 30న విడుదల చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.