హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూవివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్ 2024) షెడ్యూల్ త్వరలో విడుదలకానుంది. దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇంటర్‌మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 24 వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు దోస్త్ నోటిఫికేషన్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. గత డిగ్రీ ఏడాది కాలేజీల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ ఏడాది మొత్తం 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో సహా దాదాపు 1,054 కాలేజీలు దోస్త్ పరిధిలో ప్రవేశాలు కల్పించనున్నాయి. రాష్ట్రంలో ఉన్న పలు యూనివర్సిటీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను కూడా దోస్త్ ద్వారానే భర్తీ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర జుడీషనల్ సర్వీస్‌లోని జూనియర్ విభాగంలో 150 సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ వెలువరించింది. ఆసక్తి కలిగిన వారు మే 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లా కోర్సులో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు కనిష్ఠంగా 23 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 35 ఏళ్లు మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ (ఆన్‌లైన్), రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము కింద రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500లు తప్పనిసరిగా చెల్లించాలి. జీతభత్యాల కింద నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.