తెలంగాణ పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవింగ్, మెకానిక్ అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ట్రేడ్ టెస్టులు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. మార్చి 16 నుంచి రాష్ట్రంలో కురుస్దున్న వర్షం కారణంగా కానిస్టేబుల్ డ్రైవింగ్ టెస్టుల నిర్వహణకు ఆటంకం కలిగింది. దీంతో మార్చి 17, 18 తేదీల్లో జరగాల్సిన కానిస్టేబుల్ (డ్రైవర్) పరీక్షలు మార్చి 23, 24 తేదీలకు వాయిదా పడ్డాయి. పోలీస్ రవాణా సంస్థ (పీటీవో)లో డ్రైవర్లు, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ల ఎంపిక కోసం డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాల్సి ఉంది. మార్చి16న కురిసిన భారీ వర్షం కారణంగా టెస్టులు నిర్వహించడం కుదరకపోవడంతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం, శనివారం కూడా వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచించడంతో ఈ టెస్టులను వారం రోజులపాటు వాయిదా వేయాలని నిర్ణయించారు.
ఐతే అభ్యర్థులు మళ్లీ కొత్తగా అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో హాజరుకావచ్చని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు సూచించారు. డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డులు నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపరచుకోవల్సి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.