AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Lesson: అందరినీ గుడ్డిగా నమ్మకండి! అతిగా మంచితనం చూపిస్తే జరిగేది ఇదే!

ప్రతి ఒక్కరితో మంచిగా ఉండండి.. కానీ ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. అతిగా దయ చూపడం మంచితనం కాదు.. కొన్నిసార్లు అదే మన బలహీనతగా మారుతుంది. మీ మంచితనాన్ని ఇతరులు అలుసుగా తీసుకోకుండా హద్దులు పెట్టుకోండి. అందరినీ సంతోషపెట్టడం కంటే మీ ఆత్మగౌరవం, మనశ్శాంతిని కాపాడుకోవడం ముఖ్యం. అవసరమైనప్పుడు 'కాదు' అని చెప్పడం కూడా ఒక గొప్ప లక్షణమే. మంచిగా ఉండండి.. కానీ మీ మంచితనం వల్ల మీరే నష్టపోయేంత అమాయకంగా ఉండకండి. dయతో పాటు వివేకం, నమ్మకంతో పాటు జాగ్రత్త కూడా ఉండాలి!

Life Lesson: అందరినీ గుడ్డిగా నమ్మకండి! అతిగా మంచితనం చూపిస్తే జరిగేది ఇదే!
A Story That Teaches A Big Lesson
Srilakshmi C
|

Updated on: Oct 31, 2026 | 6:00 AM

Share

ఒకప్పుడు ఓ రాజ్యాన్ని ఎంతో దయగల రాజు పరిపాలించేవాడు. ప్రజలందరినీ సంతోషంగా ఉంచడమే తన జీవిత లక్ష్యంగా భావించేవాడు. సహాయం కోసం తన దగ్గరకు వచ్చిన ఎవరినీ ఖాళీ చేతులతో పంపించేవాడు కాదు. పేదవారికి ధనం, అవసరమైన వారికి సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందేవాడు. అయితే రాజు చూపిస్తున్న అతిప్రేమ, అతిదయ భవిష్యత్తులో ప్రమాదంగా మారుతుందని అతని మంత్రి తరచూ హెచ్చరించేవాడు. కానీ రాజు మాత్రం ఆ మాటలను పట్టించుకునేవాడు కాదు. చివరికి రాజు తన మంచితనం కారణంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు? ఓ జ్ఞాని చెప్పిన మాటలు అతని జీవితాన్ని ఎలా మార్చాయి? ఈ కథ ద్వారా తెలుసుకుందాం.

ఒకరోజు మంత్రి రాజుతో మాట్లాడుతూ.. ‘మహారాజా! అందరిపట్ల దయగా ఉండటం మంచిదే. కానీ అవసరానికి మించి దయ చూపడం ప్రమాదకరం. మీరు అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే, ఒకరోజు మీ దగ్గర ఏమీ మిగలకపోవచ్చు. మీ మంచితనాన్ని కొందరు తమ స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది’ అని హెచ్చరించాడు. అందుకు రాజు నవ్వుతూ.. ‘జీవితం చాలా చిన్నది. మన వల్ల వీలైనంతమందిని సంతోషంగా ఉంచాలి. వీళ్లంతా నా ప్రజలు. నా దగ్గరకు వచ్చినవారు నిరాశతో వెళ్లడం నాకు ఇష్టం లేదు’ అని సమాధానమిచ్చాడు. మంత్రి మౌనంగా ఉండిపోయాడు. కానీ రాజు అమాయకత్వం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని అతనికి అనిపించింది.

ఒకరోజు మంత్రి సామాన్యుడిలా వేషం మార్చుకుని గ్రామంలోకి వెళ్లాడు. అక్కడ ఓ పాత సత్రం దగ్గర కొంతమంది వ్యక్తులు మాట్లాడుకోవడం అతని చెవిన పడింది. వారి మాటలు విన్న మంత్రి ఆశ్చర్యపోయాడు. ఆ గుంపులోని నాయకుడు మాట్లాడుతూ.. ‘మన రాజు చాలా అమాయకుడు. ఎవరిని పడితే వారిని నమ్మేస్తాడు. మనం రాజభవనానికి వెళ్లి సేవకుల్లా నటిద్దాం. అతని నమ్మకాన్ని సంపాదించుకుని, చివరికి రాజభవనంలోని విలువైన వస్తువులన్నింటినీ దోచుకుందాం’ అని చెప్పాడు. ఈ విషయం విన్న మంత్రి వెంటనే రాజభవనానికి వెళ్లి రాజును హెచ్చరించాడు. కానీ రాజు మాత్రం తన ప్రజలపై అనుమానం వ్యక్తం చేయవద్దని మంత్రికి చెప్పాడు. దొంగలు తనను మోసం చేస్తారని అతను అస్సలు ఊహించలేదు.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజుల తర్వాత ఆ దొంగలు రాజభవనానికి వచ్చారు. తాము పేదవారమని, రాజుకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చామని నమ్మించారు. మొదట్లో రాజభవనాన్ని శుభ్రం చేస్తూ, సేవకుల్లా ప్రవర్తిస్తూ రాజు నమ్మకాన్ని సంపాదించారు. కొంతమంది రాజును పొగుడుతూ మాట్లాడగా, మరికొందరు ఆయనకు సేవలు చేస్తూ దగ్గరయ్యారు. వారి ప్రవర్తనకు రాజు ఎంతో సంతోషించాడు. వారిని పూర్తిగా నమ్మి రాజభవనంలోని ఖజానా గది సహా అనేక ప్రదేశాలను చూపించాడు. కొన్ని రోజుల తర్వాత రాజు ఓ ప్రయాణానికి వెళ్లాల్సి వచ్చింది. బయలుదేరే ముందు ఆ కొత్త సేవకులతో.. “నేను తిరిగి వచ్చే వరకు రాజభవనాన్ని జాగ్రత్తగా చూసుకోండి” అని చెప్పి కొంతమంది అంగరక్షకులతో కలిసి వెళ్లిపోయాడు. రాజు వెళ్లిన వెంటనే దొంగలు తమ అసలు రూపాన్ని బయటపెట్టారు. ఖజానాలోని బంగారం, ఆభరణాలు, విలువైన వస్తువులన్నింటినీ దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు.

సాయంత్రం రాజు తిరిగి వచ్చేసరికి రాజభవనం ఖాళీగా కనిపించింది. తన సంపదంతా దోపిడీకి గురైందని తెలుసుకుని తీవ్రంగా బాధపడ్డాడు. మంత్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తన అమాయకత్వమే ఈ పరిస్థితికి కారణమని గ్రహించాడు. అన్నీ కోల్పోయిన బాధతో రాజు ఒంటరిగా అడవిలోకి వెళ్లాడు. అక్కడ ఓ పాత చెట్టు కింద ప్రార్థన చేసుకుంటున్న వృద్ధ జ్ఞాని కనిపించాడు. రాజు ఆయన దగ్గరకు వెళ్లి తన బాధనంతా చెప్పుకున్నాడు. ‘స్వామీ! నేను అందరికీ మంచి చేయాలనుకున్నాను. ఎవరూ నా వల్ల బాధపడకూడదని భావించాను. నా ప్రజలను సొంతవారిలా చూసుకున్నాను. అయినా వారు నన్ను ఎందుకు మోసం చేశారు?’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ జ్ఞాని ప్రశాంతంగా నది దగ్గరకు తీసుకెళ్లాడు. ముందుగా ఓ ఎండిన మట్టి గడ్డను తీసుకుని ప్రవహిస్తున్న నదిలో వేశాడు. కొద్దిసేపటికే నీటి ప్రవాహానికి ఆ మట్టి కరిగిపోయింది. తర్వాత ఓ గట్టి రాయిని తీసుకుని నదిలో వేశాడు. నీరు దాని చుట్టూ ప్రవహించింది కానీ ఆ రాయి మాత్రం కదలకుండా అలాగే ఉంది.

అప్పుడు జ్ఞాని రాజుతో ఇలా అన్నాడు.. ‘రాజా! ఈ మట్టిని చూడు. అది చాలా మెత్తగా ఉండటంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కానీ రాయి దృఢంగా ఉండటంతో నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడింది. మనిషి జీవితం కూడా ఇలాగే ఉండాలి. అందరితో మంచిగా ఉండాలి. కానీ మన మంచితనానికి కూడా కొన్ని హద్దులు ఉండాలి. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మకూడదు. అందరికీ మంచి చేయాలనే ఆలోచన గొప్పదే. కానీ ఆ క్రమంలో మన ఆత్మగౌరవాన్ని, మనశ్శాంతిని కోల్పోకూడదు. మీ దయను కొందరు బలహీనతగా భావించి, దానిని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. అందుకే దయతో పాటు వివేకం, ధైర్యం, నిర్ణయాత్మకత కూడా ఉండాలి’ అని వివరించాడు.

జ్ఞాని చెప్పిన మాటలు రాజు మనసును తాకాయి. తాను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు. మంచితనం అంటే అందరి కోరికలను తీర్చడం కాదని, అవసరమైన చోట సరైన నిర్ణయం తీసుకోవడం కూడా మంచితనంలో భాగమేనని గ్రహించాడు. ఆ రోజు నుంచి రాజు తన ప్రజల పట్ల దయగా ఉంటూనే, ప్రతి ఒక్కరినీ నమ్మే ముందు వారి నిజాయితీని తెలుసుకోవడం ప్రారంభించాడు. అవసరమైన చోట కఠినంగా వ్యవహరిస్తూ, తన రాజ్యాన్ని తిరిగి బలోపేతం చేసుకున్నాడు.

దయ చూపించడం గొప్ప లక్షణం. కానీ హద్దులు లేకుండా దయ చూపడం మనకే నష్టం కలిగించవచ్చు. మన మంచితనాన్ని కొందరు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తారు. అందుకే ఎదుటివారికి సహాయం చేయాలి, ప్రేమించాలి, గౌరవించాలి. అదే సమయంలో మన ఆత్మగౌరవాన్ని, సూత్రాలను, మనశ్శాంతిని కాపాడుకోవాలి. గుర్తుంచుకోండి.. అందరినీ సంతోషపెట్టడం మన బాధ్యత కాదు. మన మంచితనాన్ని కాపాడుకుంటూనే, అవసరమైనప్పుడు ‘కాదు’ అని చెప్పగలగడం కూడా ఒక గొప్ప లక్షణమే!

Follow Us