
కొత్తగూడెం సింగరేణి, జులై 11: సింగరేణి సంస్థ ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పేరుతో సివిల్స్ రాస్తున్న అభ్యర్థులకు ఆర్ధిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ఈ ఏడాది కూడా అమలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేసింది. జున్ 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్న సంస్థ.. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు గడువు తేదీ జులై 7తో ముగిసింది. అయితే మరింత మందికి అవకాశం ఇచ్చేందుకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు సింగరేణి ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం జులై 10న ఒక ప్రకటనలో తెలిపారు. తాజా ప్రకటన మేరక జులై 12 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
ఈ పథకం కింద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు. సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనలతో గత ఏడాది ఈ పథకం ప్రారంభించారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు సివిల్స్‌లో విజయం సాధించారు కూడా. ఈ పథకం కింద రూ. లక్ష లబ్ధి పొందేందుకు సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులు సింగరేణి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
2024లో 140 మంది అభ్యర్థులకు ఈ పథకం కింద రూ.లక్ష చొప్పున నగదు ప్రోత్సాహకం అందించారు. వీరిలో 20 మంది మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా సర్కార్ రూ. లక్ష చొప్పున సాయం అందజేయడం గమనార్హం. ఈ ఏడాది కూడా అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేయాలని సింగరేణి ప్రకటన జారీ చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.