హైదరాబాద్, డిసెంబర్26: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పలు పోస్టింగ్‌లు, బదీలీలతో మార్పులు చకాచకా చోటు చేసుకుంటున్నాయి. గతంలో నామినేటేడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయగా.. ప్రభుత్వ అధికారుల ట్రాన్స్‌ఫర్లు సర్కారు చేస్తూ వస్తోంది. అన్నింట పరిస్థితి బానే ఉన్న ఒక్క చోట మాత్రం పదవి స్వీకరించేందుకు ఎవరు ముందుకు రావడం లేదని వినికిడి. ఒకరకంగా గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడానికి ఆ విభాగమే కారణమన్న వాదన, మరోవైపు బండెడు సవాళ్లతో స్వాగతం పలికే ఆ ముళ్ల కుర్చీపై కుర్చొనే సాహసమా! అంటూ పలువురు రిటైర్డ్ ఆఫీసర్లు, విద్యావంతులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి.
పేపర్ లీకేజీలతో గతంలో నిరుద్యోగుల పాలిట విలన్ గా మారిన టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనకు కొత్త సర్కారు నడుం బిగించింది. చైర్మన్ సహా కమిషన్ సభ్యులను రాజీనామా చేయాలని సూచించగా చైర్మన్ జనార్ధన్ రెడ్డి సహా ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. మరో ఇద్దరు సభ్యులు మాత్రం రాజీనామా చేయలేదు. చేసిన రాజీనామాలను కూడా గవర్నర్ వద్దే ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి ఆమోదం పొందితేనే కొత్త బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఇదే తలనొప్పిగా మారింది. నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేళ వాళ్లని ఏమాత్రం నిరాశ పరిచిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఇప్పటికే TSPSC నుంచి వెలువడిన పలు నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే వాటిని బోర్డు ప్రక్షాళన తర్వాతే నిర్వహించే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 6,7న జరగాల్సిన గ్రూప్ -2 పరీక్షపై కూడా సందిగ్ధత వీడటం లేదు. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పరీక్షల వాయిదా అనివార్యంగా కనిపిస్తోంది. మరోవైపు 5 లక్షల మంది అభ్యర్థులు బోర్డు ప్రకటన కోసం ఎదరుచూస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కానీ, TSPSC అధికారులు కానీ ఇంతవరకు నోరువిప్పడం లేదు.
కొత్త బోర్డు ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లను రేవంత్ సర్కారు సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఎక్కువ మంది ఆ పదవిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొవడంతో పాటు ఏ చిన్న తప్పిదం జరిగినా ఎక్కువ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మో ఆ పదవా వద్దే వద్దు అంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత కమిషన్ రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపితేనే కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. కొత్త కమిషన్ ఏర్పాటు అయితేనే నోటిఫికేషన్లు, పరీక్షలు ముందుకు సాగే వీలు కనిపిస్తోంది. కొత్త సర్కారు కొత్త ఏడాదిలోనే కొత్త బోర్డుతో నిరుద్యోగులకు తీపివార్త అందించే ఛాన్స్ ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.