
అమరావతి, మే 19: రాష్ట్రంలో ఇటీవల పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడి కుటుంబంలో పుట్టి, పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విద్యార్ధులు కాలేజీ విద్య అభ్యసించేందుకు ఈ ఉపకార వేతనం సహాయ పడుతుంది. ఏపీతోపాటు ప్రస్తుతం కేరళ, కర్ణాటక, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి లబ్ధి పొందుతున్నారు.
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.75 వేల వరకు ఉపకార వేతనాలు అందిస్తారు. అయితే కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. అలాగే 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతిలో కనీసం 90 శాతం మార్కులు లేదా 9 సీజీపీఏ సాధించి ఉండాలి. ఈ అర్హతలున్న విద్యార్ధులు సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దివ్యాంగ విద్యార్థులు కనీసం 75 శాతం లేదా 7.5 సీజీపీఏ సాధిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులందరికీ జులై 13న ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభకనబరచిన విద్యార్ధులను ఎంపిక చేస్తారు. విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీల్లో వార్డు ఇన్‌స్యూర్డ్ పర్సన్ (ఐపీ) కోటా కింద 2025-26 విద్యాసంవత్సరానికి కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ సీట్ల కోసం వార్డు ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు మే 28 వరకు పొడిగించారు. ఈ మేరకు ఈఎస్‌ఐసీ వైద్యవిద్య విభాగం ప్రకటన జారీ చేసింది. ఈఎస్‌ఐసీ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి మే 28 అర్ధరాత్రి వరకు అవకాశం ఉంటుందని పేర్కొంది. దరఖాస్తు చేసిన వారికి జూన్ 2న ఐపీ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్లు ఉన్న విద్యార్థులు ఐపీ కోటా కింద ఈఎస్‌ఐసీ కాలేజీల్లో సీట్లు పొందవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.