RRB NTPC Exam Dates: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 2019లో 35,208 పోస్టులతో ఎన్టీపీసీ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతోంది. 35,208 పోస్టులకు గాను దేశవ్యాప్తంగా ఏకంగా 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో నియామక ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.
ఇప్పటికే ఐదు దశల్లో పరీక్షలు నిర్వహించగా తాజాగా ఏప్రిల్ 1 నుంచి ఆరో దశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలు వచ్చే నెల 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో జరగనున్నాయి. ఆరో దశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డును పరీక్షకు 4 రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 27 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం వంటి కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు.
అభ్యర్థులు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని తదుపరి రౌండ్లకు ఎంపిక చేస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. గణితం, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల్లో పరీక్ష పూర్తవుతుంది. తుది ఫలితాల్లో ఎంపికైనవారిని ట్రైన్ క్లర్క్, జూనియర్ క్లర్క్, టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్ తదితర పోస్టుల్లో నియమిస్తారు. ఇక ఈ పరీక్షలు గతేడాది డిసెంబర్ 28న ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో పరీక్షలను దశలవారీగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చేసే మోసపూరిత ప్రకటనలను నమ్మకూడదని రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది.
Also Read: CRPF Recruitment 2021: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు.. ప్రారంభ జీతం రూ. 85 వేలు.. మీరు అప్లయ్ చేశారా?..