అమరావతి, మే 7: ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్‌జీయూ కేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అమవుతుంది. జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3 ఫేజ్‌లలో కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందుతారు.
మొత్తం నాలుగు క్యాంపస్‌లలో.. ఒక్కో క్యాంపస్‌కు వెయ్యి సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు 100 సీట్లు కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు 25 శాతం సూపర్ న్యూమరీ సీట్లు కేటాయిస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ప్రకారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కేటగిరీ వైజ్ ప్రాధాన్యత క్రమంలో క్యాంపస్‌లను కేటాయించడం జరుగుతుంది. ఒకసారి క్యాంపస్ కేటాయించిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో బదిలీకి అవకాశం ఉండదు.
పీయూసీ కోర్సుకి ట్యూషన్ ఫీజు కింద ఒక్కో ఏడాది రూ.45 వేలు చెల్లించవల్సి ఉంటుంది. బీటెక్ ప్రోగ్రాంకు ఏడాదికి రూ.50 వేల చొప్పున చెల్లించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు కింద ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: మే 8, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు: జూన్ 25, 2024.
ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: జులై 1 నుంచి 5 వరకు
ఫలితాల ప్రకటన తేదీ: జులై 11, 2024.
ప్రవేశాల ప్రారంభ తేదీ: జులై మూడో వారం నుంచి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.