
అమరావతి, ఆగస్ట్ 19: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. రేపట్నుంచే (ఆగస్ట్ 20) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజున వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తన ప్రటకనలో తెలిపింది. రిజిస్ట్రేషన్లకు ఐదారు రోజులు సమయం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.
తెలంగాణలో ఉమ్మడి పరీక్షలకు సంబంధించి గత ఏడాది ఓ కొత్త రూల్ అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నియమాక పరీక్షలుతోపాటు ఇతర ప్రవేశ పరీక్షలకు ప్రాధమిక ఆన్సర్‌కీపై అభ్యంతరాలు లేవనెత్తేందుకు నిర్ధిష్ట రుసుము చెల్లించాలనే కొత్త నిబంధన తీసుకువచ్చింది. దీంతో టీజీపీఎస్సీ నియామక పరీక్షలతోపాటు రాష్ట్రంలో నిర్వహించే అన్ని ఉమ్మడి పరీక్షలకు ఆన్సర్ కీలపై అభ్యంతరాలు లేవనెత్తాలంటే ఒక్కో ప్రశ్నకు నిర్ధిష్ట రుసుము చెల్లించాలని పేర్కొంది. ఈ విధానం ద్వారా అనవసరంగా సమయం వృద్ధా అవ్వడం అరికట్టవచ్చని, సకాలంలో నియామకాలు పూర్తి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలకు ఈ విధానం అమలు చేస్తూ వచ్చింది.
తాజాగా ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(టీజీ సీపీగెట్) ప్రాథమిక కీపై కూడా అభ్యర్థులు అభ్యంతరం తెలిపేందుకు తొలిసారిగా ఫీజు చెల్లించాలని పేర్కొంటూ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది జరిగిన ఈఏపీసెట్, ఐసెట్ వంటి పలు ప్రవేశ పరీక్షలకు అభ్యంతరాలపై ఫీజు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇదే మాదిరి సీపీగెట్‌లోనూ ఒక్కో ప్రశ్నపై అభ్యంతరానికి ఫీజు రూ.200 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ అభ్యర్ధులు తెలిపే అభ్యంతరాలు సరైనవని తేలితే వాటిని పరిగణనలోకి తీసుకుని, ఫీజును తిరిగి చెల్లిస్తామని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆగస్ట్ 21వ తేదీ ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్ విధానంలో పంపొచ్చని ఆయన సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.