Telugu student in IIT-Madras: ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో చదివే ప్రతి నలుగురిలో ఒకరు తెలుగు విద్యార్ధి కావడం విశేషమని, మెజార్టీ విద్యార్ధులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని శనివారం (సెప్టెంబర్ 3) ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వీ కామకోటి తెలిపారు. జేఈఈ ఆశావహులు త్వరలో జరగనున్న కౌన్సెలింగ్‌లో తమ ఇన్‌స్టిట్యూట్‌ను ఎంచుకోవాలని ఆయన నగర విద్యార్ధులకు ఆహ్వానం పలికారు. ఐఐటీ మద్రాస్‌లో చేరికలకు విద్యార్ధులను ఆకర్షించేందుకు, కోర్సుల ఎంపిక, క్యాంపస్ లైఫ్, ప్లేస్‌మెంట్స్, ఐఐటీలపై సమాచారం అందించేందుకు అక్కడి పూర్వ విద్యార్ధులు ‘AskIITM’ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీ కామకోటి మాట్లాడుతూ.. ఐఐటీలు, బ్రాంచులను ఎంచుకోవడంలో జేఈఈ ఆశావహులకు రాబోయే రోజులు చాలా కీలకమైనవి. విద్యార్ధులు ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌ను ఎంచుకోవాలనేదే మా ప్రయత్నం. జేఈఈ తుది గమ్యంగా భావించవద్దు. నేను జేఈఈ క్లియర్ చేయలేదు. దీంతో మద్రాస్ యూనివర్సిటీలో బీటెక్ చదివాను. ఆ తర్వాత ఐఐటీలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ పూర్తి చేశాను. కానీ యాదృచ్ఛికంగా.. జేఈఈ పరీక్ష క్లియర్ చేయలేకపోయిన నేను చివరికి జేఈఈకి ఛైర్మన్‌గా, డైరెక్టర్ అయ్యాను. అందువల్లనే ఐఐటీలో చేరాలనుకునే వారు జేఈఈ ఒక్కటే మార్గం అని అనుకోకూడదని విద్యార్ధులకు తన జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా ప్రేరణ కలిగించారు.
ఆ తర్వాత ఐఐటి మద్రాస్ డీన్, ప్రొఫెసర్ మహేష్ ఈ విధంగా మాట్లాడారు.. ఐఐటీ-మద్రాస్‌లో చదివే ప్రతి నలుగురిలో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కావడం విశేషం. మెకానికల్ ఇంజినీరింగ్‌లో తెలుగు విద్యార్ధులు 255 మంది ఉన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో 244 మంది, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 167 మంది, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 165 మంది చదువుతున్నారు. మొత్తం ఇన్‌స్టిట్యూట్ విద్యార్ధులు మొత్తం 4,500 మంది ఉండగా వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే సుమారు 1,210 మంది వరకు ఐఐటీ మద్రాస్‌లో చదువుతున్నారని తెలిపారు.