MBBS Counselling: పాత విధానంలోనే ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌.. NMC ప్రకటన

|

Jul 18, 2023 | 12:41 PM

దేశ వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది పాత విధానంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఆలిండియా కోటా మొదటి రౌండ్‌ తర్వాతే..

MBBS Counselling: పాత విధానంలోనే ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌.. NMC ప్రకటన
MBBS counselling
Follow us on

న్యూఢిల్లీ, జులై 18: దేశ వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది పాత విధానంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఆలిండియా కోటా మొదటి రౌండ్‌ తర్వాతే రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించుకోవాలని తెలియజేస్తూ అన్ని రాష్ట్రాలకు ప్రకటన వెలువరించింది. నీట్‌ యూజీ 2023లో అర్హత సాధించిన విద్యార్థులకు ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత రాష్ట్రాల మెడికల్‌ యూనివర్సిటీలు మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయి. ఈ ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాల కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఎంసీసీనే కౌన్సెలింగ్‌ నిర్వహింస్తామని చెప్పిన సంగతి తెలసిందే. ఐతే ఈ ప్రతిపాదనను తెలంగాణ, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం వెనకడుగు వేసింది.

ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఏకకాలంలో పూర్తిచేసే నేపథ్యంలో కొత్త నిర్ణయం ప్రకటించింది. ఆలిండియా కోటా సీట్లకు ఎంసీసీ, కన్వీనర్‌ కోటా సీట్లకు రాష్ట్రాలు ఏకకాలంలో కౌన్సెలింగ్‌ నిర్వహించేలా ఎన్‌ఎంసీ ప్రతిపాదించింది. దీంతో అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ ప్రతిపాదనను ఎంసీసీ తాజాగా విరమించుకుంది. ఆలిండియా కోటా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ (నర్సింగ్‌) సీట్ల భర్తీకి ఆదివారం కొత్త షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ఎంసీసీ మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టనుంది. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 6వ తేదీ నాటికి పూర్తవుతుంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ తేదీలను నిర్ణయించే అవకాశం ఉంది.

కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 3,790 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా వీటిలో ఆలిండియా కోటా 15 శాతం సీట్లు మినహాయిస్తే మిగిలినవి 3221 ఎంబీబీఎస్‌ సీట్లు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 50 శాతం కన్వీనర్‌ కోటా కింద మరో 2325 సీట్లకు కలిపి మొత్తం 5,546 సీట్లకు కాళోజీ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. తెలంగాణ నుంచి 44,629 మంది అర్హత సాధించగా వీరిలో ఇప్పటి వరకు 23 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 2023-24, 2025-26 విద్యాసంవత్సరాలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.