హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర నీట్ యూజీ 2024 ర్యాంకులు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొత్తం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో జాతీయ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్రంలోని విద్యార్థులకే కేటాయించనున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్లు పదేళ్ల పాటు అమలైంది. అది ఈ ఏడాదితో రద్దైంది. ఇప్పటి వరకు తెలంగాణలో 2014కు ముందు ఏర్పాటైన అన్ని మెడికల్ కాలేజీల్లో 15 శాతం (అన్‌రిజర్వ్‌డ్) కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు పోటీపడేవారు. అది ఇకపై అమలు కాదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావడంతో 2024-25 విద్యా సంవత్సరం నుంచి కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ కానున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పటికేఉ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ ఆదివారం (ఆగస్టు 4) నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఇక ఆలిండియా కోటా సీట్ల భర్తీకి ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు ఆగస్టు 23న వెల్లడిస్తారు. ఆగస్టు 20వ తేదీ తర్వాత నుంచి సీట్ల కేటాయింపుకు ఆప్షన్లు స్వీకరిస్తారు. తెలంగాణలో ఇటీవల కొత్తగా మరో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడంతో మొత్తం 60 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 30 ప్రభుత్వ, 30 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. మొత్తం 8,715 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో జాతీయ కోటా కింద 617 సీట్లు భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను రాష్ట్రంలో కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. ప్రభుత్వ కాలేజీల్లో 4,115 సీట్లు, కన్నవీనర్ కోటా సీట్లు 3,498 సీట్లు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 4,600 ఉన్నాయి. వీటిల్లో కన్వినర్ కోటా సీట్లు 2,300 వరకు ఉన్నాయి.
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం రిజర్వేషన్ చొప్పున సీట్లు దక్కనున్నాయి. రాష్ట్రం నుంచి నీట్-యూజీ పరీక్షను 77,848 మంది విద్యార్థులు హాజరుకాగా.. 47,356 మంది అర్హత సాధించారు. గత ఐదేళ్లలో 60 శాతంకి పైగా విద్యార్థులు నీట్-యూజీలో అర్హత సాధించడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్లకు మరింత పోటీ నెలకొంది.