
హైదరాబాద్, నవంబర్ 28: నీట్-సూపర్ స్పెషాలిటీ రాత పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. నవంబర్‌లో జరగాల్సిన పరీక్షలు డిసెంబరు 26, 27 తేదీలకు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలుకు రాసిన లేఖలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో వైద్య విద్య పీజీ కోర్సు పరీక్షలు, నీట్-సూపర్ స్పెషాలిటీ పరీక్షలు ఒకేసారి రావడం వల్లనే నీట్-సూపర్ స్పెషాలిటీ పరీక్షలు డిసెంబరుకు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ రెండు పరీక్షలకు సమాయత్తం కాలేక విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని అందువల్ల వీటిని నెలరోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ శ్రీకృష్ణదేవరాయలు సెప్టెంబర్ 8న నడ్డాకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆయన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్‌తో సంప్రదించి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయన తాజాగా కృష్ణదేవరాయలుకు లేఖ రాశారు. ఈ మేరకు విద్యార్ధులు గమనించాలని అందులో తెలిపారు.
కుటుంబ కలహాలు, ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఎందరో విద్యార్ధులు తమ చదువును అర్ధాంతరంగా మధ్యలోనే మానేసే పరిస్థితి దాపురిస్తుంది. అటువంటి వారికి సార్వత్రిక విద్యా విధానం (టాస్) ఆధ్వర్యంలో ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమవగా.. దరఖాస్తు గడువు నవంబర్ 27వతో ముగింపుకు వచ్చింది. ఈ క్రమంలో డిసెంబర్ 7 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఫీజులను ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని సూచించారు. ఇతర పూర్తి వివరాలకు 93460 20003 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.