
న్యూఢిల్లీ, జులై 24: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో పేపర్ లీక్‌లపై ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వివరించారు. పేపర్ లీక్ ఘటనలు సాధారణ విషయాలు కావని, అవి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అత్యంత తీవ్రమైన అంశాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పరీక్షలకు ఎంతో శ్రమించి సిద్ధమైన విద్యార్థులకు ఇలాంటి ఘటనలు తీవ్ర మానసిక వేదన కలిగిస్తాయని అన్నారు.
ఇప్పటికే పేపర్ లీక్ ఘటనలకు బాధ్యులైన పలువురిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని మోదీ తన వీడియోలో తెలిపారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకూడదన్న ఉద్దేశంతో వెంటనే మళ్లీ పరీక్షలు నిర్వహించి ముందుకు వెళ్లామని తెలిపారు. రీ-టెస్ట్ నిర్వహణ తర్వాత అనేక మంది విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు. లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. అలాగే ఈ అంశంపై ఈ రోజు (జులై 24) జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి, ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేసే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. కాగా నీట్ 2026 పేపర్ లీక్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన విద్యార్ధుల నిరసన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U
— Narendra Modi (@narendramodi) July 23, 2026
మరోవైపు ప్రధానమంత్రి అర్ధరాత్రి పంపిన సందేశంలో క్యాబినెట్ సమావేశంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జె.పి. నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన దీక్షను ముగించారు. పేపర్ లీక్ ఘటనలపై ప్రభుత్వ హామీతో ఇప్పుడు ఆందోళనల కంటే నిర్ణయాల అమలుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు, సమర్థవంతమైన అమలు వ్యవస్థను తీసుకురావాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.