NEET Exam Pattern: జేఈఈ బాటలోనే ‘నీట్‌’గా.. నీట్‌ పరీక్ష విధానం మారుతుందోచ్‌! ఇకపై రెండంచెల్లో వడపోత..

గత నీట్ పరీక్ష దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తు ప్రకంపనలు పుట్టించింది. ఓ వైపు పేపర్ లీకేజీలు.. మరోవైపు కొందరికి అదనంగా కలిపిన మార్కులు. వెరసి నీట్ పరీక్ష నిర్వహణ అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో తాజాగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. నీట్ పరీక్షను రెండంచెల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై నిపుణుల కమిటీ..

NEET Exam Pattern: జేఈఈ బాటలోనే 'నీట్‌'గా.. నీట్‌ పరీక్ష విధానం మారుతుందోచ్‌! ఇకపై రెండంచెల్లో వడపోత..
NEET Exam Pattern
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 07, 2024 | 7:24 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 7: దేశ వ్యాప్తంగా జరిగే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో జేఈఈ, నీట్‌ ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే యేటా ఈ పరీక్షలకు దాదాపు లక్షల మంది విద్యార్ధులు ఒక్కో పరీక్షకు పోటీ పడుతుంటారు. అయితే తాజాగా జేఈఈ పరీక్షలో ఎన్టీయే పలు మార్పులు చేసింది. గతంలో ఏడాదికి ఒక్కసారే నిర్వహించే జేఈఈ పరీక్షను ప్రస్తుతం ప్రతీ యేట రెండు విడతల్లో నిర్వహిస్తుంది. ఇక తాజాగా అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు కూడా అటెంప్ట్‌ల సంఖ్యను మూడుకు పెంచారు. జేఈఈ తరహాలోనే నీట్‌ పరీక్షలో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. జేఈఈ మాదిరిగానే నీట్‌ పరీక్షను కూడా ప్రతీ యేట రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు రాధాకృష్ణన్‌ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది జరిగిన నీట్‌ యూజీ 2024 పరీక్షలో కొందరు విద్యార్థులకు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇచ్చినందుకు వారికి మార్కులు కేటాయించిన విధానం పెద్ద ఎత్తు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనితోపాటు నీట్ ప్రశ్నపత్రాలు లీకేజీలు కూడా జరిగాయి.

వీటన్నింటి దృష్ట్యా జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో సమర్థంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన సూచనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత జులైలో ఇస్రో మాజీ ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవల కేంద్ర విద్యాశాఖకు ముసాయిదా నివేదిక సమర్పించినట్లు సమాచారం. నీట్, సీయూఈటీ (కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) పరీక్ష నిర్వహణలో మార్పులకు సంబంధించి ఈ కమిటీ కొన్ని సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగా ప్రస్తుతం ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో సీట్ల భర్తీకి తొలుత జేఈఈ మెయిన్‌ నిర్వహించి, అందులో కనీస మార్కులు సాధించిన వారిలో 1.50 లక్షల విద్యార్ధులను మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అనుమతిస్తున్నారు. ఇదే తరహాలో నీట్‌ పరీక్ష కూడా రెండంచెల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు సాగుతున్నాయి.

ప్రతీయేట దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు దాదాపు 18 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. తొలుత వడపోత కోసం ఒక పరీక్ష నిర్వహించి, అందులో కనీస మార్కులు సాధించిన వారికి మరో పరీక్ష నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. దానివల్ల తుది పరీక్షకు విద్యార్థులు, పరీక్షా కేంద్రాల సంఖ్య ఘననీయంగా తగ్గుతుంది. తద్వారా తుది ఎంపిక సులువు అవుతుంది. అవసరమైతే తొలి పరీక్షను ఆన్‌లైన్‌లో, తుది పరీక్షను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ఆఫ్‌లైన్‌ పరీక్ష నిర్వహించాలంటే ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలకు పంపే సమయంలో లీకేజీకి అవకాశం ఉన్నందువల్ల పరీక్ష ప్రారంభమయ్యేందుకు అరగంట లేదా గంట ముందు డిజిటల్‌ రూపంలో ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం పంపొచ్చని భావిస్తున్నారు. వాటిని అప్పటికప్పుడు ప్రింట్లు తీసి పరీక్షా కేంద్రాల్లోని విద్యార్థులకు ఇవ్వాలి. ఎన్‌టీఏలో అత్యధిక సిబ్బంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం వల్ల.. పరీక్షల నిర్వహణ, డేటా భద్రత కోసం నిపుణులైన శాశ్వత ఉద్యోగులను నియమించుకోవాలని కమిటీ సూచించినట్లు తెలిసింది. దీనిపై తుది నివేదికను మరి కొద్దిరోజుల్లో సమర్పించే అవకాశం ఉంది. దీంతో నీట్‌ పరీక్ష విధానంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.