Microsoft: అమరావతి సిగలో మరో మణిహారం.. రూ.1,772 కోట్లతో మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు!
దిగ్గజ [ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ స్థాపనకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రూ.1,772.08 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1,200 క్యూబిట్ సామర్థ్యమున్న (50 లాజికల్ క్యూబిట్స్) భారీ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనుంది. క్వాంటం వ్యాలీ భవనానికి..

అమరావతి, నవంబర్ 7: ప్రముఖ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ స్థాపనకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రూ.1,772.08 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1,200 క్యూబిట్ సామర్థ్యమున్న (50 లాజికల్ క్యూబిట్స్) భారీ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనుంది. క్వాంటం వ్యాలీ భవనానికి ఆనుకుని 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రత్యేక భవనంలో మైక్రోసాఫ్ట్ ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి, ఈ భవనానికి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) 50 ఎకరాలు కేటాయించింది.
ప్రభుత్వ ప్రకటన మేరకు క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ జనవరి 1, 2026 నాటికి కార్యకలాపాలకు సిద్ధంగా ఉంటుంది. ఇది దేశీయ, విదేశీ క్లయింట్‌లకు సేవలందించడానికి దశలవారీగా 90,000 చదరపు అడుగుల అంతర్నిర్మిత ప్రాంతంలో సూపర్ కంప్యూటర్‌లను ఉంచనుంది. 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ఇప్పటికే ఐబీఎం సంస్థ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
‘అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్’ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. ఇది జనవరి 1, 2029 నాటికి ఈ రంగంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటం టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, సిలికాన్ వ్యాలీ తరహాలో శక్తివంతమైన ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై దృష్టి సారించడానికి అమరావతిని దేశంలోని మొట్టమొదటి క్వాంటం వ్యాలీగా మార్చడం ఈ ప్రకటన లక్ష్యం. మరోవైపు క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. జపాన్‌కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ కింద అందించే నిధులకు మరో 50 శాతం వెచ్చించి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తెచ్చింది.
క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనలకు దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం నిర్మించనున్న ఐకానిక్ టవర్ వల్ల 40 వేల చదరపు అడుగులు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు దేశంలోనే మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌ను స్థాపించడానికి ప్రభుత్వంతో సహకరించడానికి IBM ఇప్పటికే TCS, L&T లతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవల జరిగిన క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్‌లో IBM దాని తాజా 156-క్విట్ హోరాన్ ప్రాసెసర్ మోడల్‌ను కూడా ప్రదర్శించింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటం సైన్స్, దాని అనువర్తనాలపై అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఇప్పటికే 2025 ను అంతర్జాతీయ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది. క్వాంటం అనేది గేమ్-ఛేంజింగ్ టెక్నాలజీ. ఇది 2030 నాటికి వేగంగా అభివృద్ధి చెందనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




