AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

96 ఏళ్ల వయసులో స్టేట్‌ ఫస్ట్ ర్యాంక్‌.. చరిత్ర సృష్టించిన అమ్మమ్మ!

కేరళలోని ఓ చిన్న గ్రామంలో కర్త్యాయిని అమ్మ జీవితం సాధారణంగానే మొదలైంది. కార్త్యాయని అమ్మ కేరళలోని అలప్పుజ జిల్లా చెప్పాడ్ (హరిపాడ్ సమీపం)కు చెందింది. కాగా ఆమె 1922లో జన్మించింది. పేదరికం కారణంగా కర్త్యాయిని అమ్మ చిన్నతనంలో ఎప్పుడూ పాఠశాలకు వెళ్లే అవకాశం ఆమెకు దక్కలేదు. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకు దూరమై, జీవనం కోసం ఇంటిపనులు, శుభ్రపరిచే పనులు చేస్తూ కాలం గడిపారు. జీవనం కోసం ఇంటిపనులు, దేవాలయాల్లో శుభ్రపరిచే పనులు చేశారు..

96 ఏళ్ల వయసులో స్టేట్‌ ఫస్ట్ ర్యాంక్‌.. చరిత్ర సృష్టించిన అమ్మమ్మ!
Karthyayani Amma Story
Srilakshmi C
|

Updated on: Sep 03, 2026 | 3:26 PM

Share

కార్త్యాయని అమ్మకు చిన్న తనంలోనే వివాహంకాగా.. ఆరుగురు సంతానం కలిగారు. కానీ ఆమె మనసులో మాత్రం ఒక కోరిక ఎప్పుడూ ఉండేది. వయసు పెరిగినా ఆ కోరిక చనిపోలేదు. కర్త్యాయిని అమ్మకు చదువుపై మళ్లీ ఆసక్తి కలగడానికి ఆమె కుమార్తె అమ్మిణియమ్మ ప్రధాన స్ఫూర్తిగా నిలిచారు. అమ్మిణియమ్మ కూడా చిన్నతనంలో చదువును మధ్యలోనే ఆపేశారు. అయితే తర్వాత నిరంతర విద్యా తరగతుల్లో చేరి పదో తరగతికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తన కుమార్తె సాధించిన విజయాన్ని చూసిన కర్త్యాయిని అమ్మకు కూడా ధైర్యం వచ్చింది. ‘ఆమె చేయగలిగితే నేనెందుకు చేయలేను?’ అని అనుకున్నారు. అలా 90 ఏళ్ల వయసు దాటిన తర్వాత కర్త్యాయిని అమ్మ చదువుకోవడం ప్రారంభించారు.

96 ఏళ్ల వయసులో అద్భుత విజయం

2018లో కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ నిర్వహించిన ‘అక్షరలక్షం’ అక్షరాస్యత పరీక్షకు కర్త్యాయిని అమ్మ హాజరయ్యారు. అప్పుడు ఆమె వయసు 96 సంవత్సరాలు. ఆ పరీక్షకు వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. చదవడం, రాయడం, గణితం వంటి అంశాల్లో వారి సామర్థ్యాన్ని పరీక్షించారు. కర్త్యాయిని అమ్మ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె 100 మార్కులకు 98 మార్కులు సాధించారు. పరీక్షకు హాజరైన 40,363 మంది అభ్యర్థుల్లో మొదటి ర్యాంక్ సాధించారు. రాతలో 40కి 38 మార్కులు సాధించగా, చదవడం మరియు గణితంలో పూర్తి మార్కులు సాధించారు. ఆమె విజయం కేరళలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్త్యాయిని అమ్మ అసాధారణ విజయాన్ని గుర్తించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ అందించారు. అప్పటి విద్యాశాఖ మంత్రి సి. రవీంద్రనాథ్ కూడా ఆమెను కలిసి అభినందించి ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు. అంతటితో ఆమె చదువు ఆగలేదు. తర్వాత కేరళ స్టేట్ లిటరసీ మిషన్ నిర్వహించిన నాలుగో తరగతికి సమానమైన పరీక్షను కూడా ఆమె విజయవంతంగా పూర్తి చేశారు.

దేశం గుర్తించిన వృద్ధ విద్యార్థిని

కర్త్యాయిని అమ్మ కథ క్రమంగా దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా మారింది. ఆమెను కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఆమెకు ప్రతిష్ఠాత్మక నారీ శక్తి పురస్కారం అందించింది. చదువుకు వయసు అడ్డంకి కాదని తన జీవితంతో నిరూపించిన కర్త్యాయిని అమ్మకు దేశం గౌరవం ఇచ్చింది. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా కర్త్యాయిని అమ్మ చదువుకోవాలనే కోరికను వదులుకోలేదు. పాఠశాలకు వెళ్లే అవకాశం చిన్నతనంలో రాలేదు. కానీ వయసు 96 ఏళ్లు వచ్చినప్పుడు ఆమె విద్యార్థిగా మారారు. అందుకే ఆమె కథలో గొప్ప విషయం కేవలం 98 మార్కులు సాధించడం కాదు. ‘నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు’ అనే విషయాన్ని ఆమె ప్రపంచానికి తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

‘నారీ శక్తి పురస్కారం’తో గౌరవం

కర్త్యాయిని అమ్మ ప్రతిభ, పట్టుదలకు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. ఆమెను కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. 2020 మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కేరళ ప్రదర్శించిన ‘నారీ శక్తి అండ్ ఫోక్ ట్రెడిషన్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్’ శకటంలోనూ కర్త్యాయిని అమ్మకు ప్రత్యేక స్థానం కల్పించారు. చివరకు 2023 అక్టోబర్ 10న కర్త్యాయిని అమ్మ 101 ఏళ్ల వయసులో కన్నుమూశారు. స్ట్రోక్ రావడంతో మంచానికే పరిమితమైన ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం కేరళ అక్షరాస్యత ఉద్యమానికి తీరని లోటుగా నిలిచింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెను ‘కేరళ గర్వకారణం’గా అభివర్ణిస్తూ సంతాపం తెలిపారు. ఎన్నో మంది మహిళలకు కర్త్యాయిని అమ్మ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

కర్త్యాయిని అమ్మ చెప్పిన జీవిత పాఠం

కర్త్యాయిని అమ్మ పాఠశాలలో చదవలేదు. జీవితంలో ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. అయినప్పటికీ తనలోని విద్యార్థిని మాత్రం చంపుకోలేదు. 96 ఏళ్ల వయసులో పుస్తకం పట్టుకుని పరీక్ష రాసి మొదటి ర్యాంక్ సాధించారు. అందుకే ఆమె జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది.. వయసు ఒక సంఖ్య మాత్రమే. మనసులో నేర్చుకోవాలనే కోరిక, సాధించాలనే పట్టుదల ఉంటే జీవితంలో ఎప్పుడైనా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. కర్త్యాయిని అమ్మ ఇక మన మధ్య లేకపోయినా.. ఆమె కథ మాత్రం ప్రతి తరానికీ ఒక స్ఫూర్తిగా నిలిచిపోతుంది.

Follow Us