AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs WI: భారత్‌లో 24 ఏళ్ల కల తీరేనా?.. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు

IND Vs WI: భారత్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ సిద్ధమైంది. 2002 తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించలేకపోయిన విండీస్‌కు ఈసారి ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించే అవకాశం ఉంది. టీమిండియాతో సిరీస్ తమ జట్టు ప్రస్తుత స్థాయిని పరీక్షించుకునేందుకు కీలకమని హెడ్ కోచ్ డారెన్ సామీ పేర్కొన్నారు. సెప్టెంబర్ 27 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

IND Vs WI: భారత్‌లో 24 ఏళ్ల కల తీరేనా?.. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు
West Indies
Rakesh
|

Updated on: Sep 25, 2026 | 1:03 PM

Share

IND Vs WI: వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్నాయి. వన్డే సిరీస్ సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత 24 ఏళ్లుగా వెస్టిండీస్ జట్టు భారత్‌లో ఒక్క వన్డే సిరీస్‌ను కూడా గెలవలేకపోయింది. అయినప్పటికీ ప్రస్తుత హెడ్ కోచ్ డారెన్ సామీ మాత్రం ఈసారి ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, చరిత్ర సృష్టిస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నారు.

24 ఏళ్ల పాత రికార్డును బ్రేక్ చేస్తామన్న కోచ్

భారత గడ్డపై భారత్‌ను ఓడించడం ఏ జట్టుకైనా కష్టతరమైన సవాలేనని డారెన్ సామీకి బాగా తెలుసు. వెస్టిండీస్ జట్టు చివరగా 2002లో భారత్‌లో వన్డే సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరో విజయం టీమిండియా మీద సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో డారెన్ సామీ మాట్లాడుతూ.. ప్రపంచ నంబర్-1 జట్టు అయిన భారత్‌తో వారి స్వదేశంలో తలపడటం గొప్ప అనుభవమని, ప్రపంచ క్రికెట్‌లో మా జట్టు ప్రస్తుత స్థాయి ఏంటో తెలుసుకోవడానికి ఇదొక చక్కటి అవకాశమని పేర్కొన్నారు. ఈ సిరీస్‌ను గెలిచి 24 ఏళ్ల పాత పరాజయాల పరంపరకు ముగింపు పలకాలని తమ జట్టు ఉత్సాహంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

2027 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టెన్షన్

వెస్టిండీస్ జట్టు రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. దీనివల్ల వారు వచ్చే ఏడాది జరిగే క్వాలిఫైయర్ రౌండ్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. ఈ కారణంగా భారత్‌తో జరిగే ఈ వన్డే సిరీస్ విండీస్ జట్టుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. బలమైన భారత జట్టును వారి సొంతగడ్డపై ఎదుర్కొని సిరీస్ గెలవడం కరీబియన్ జట్టుకు పెద్ద సవాలే అయినప్పటికీ, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కోచ్ సామీ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇండియా – వెస్టిండీస్ వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్

భారత్ – వెస్టిండీస్ మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్ షెడ్యూల్ ఇదే

మొదటి వన్డే: సెప్టెంబర్ 27

రెండో వన్డే: సెప్టెంబర్ 30

మూడో వన్డే: అక్టోబర్ 3

ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై టీమిండియాను కట్టడి చేసి విండీస్ జట్టు చిరకాల వాంఛ అయిన సిరీస్ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us