బెంగళూరు, నవంబర్ 14: రిక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు జరిగే సమయంలో అభ్యర్థుల డ్రెస్ కోడ్‌లో కీలక మార్పులు తీసుకొచ్చింది. తలను పూర్తిగా కప్పేలా టోపీలు లేదా దుస్తులు ధరించిన వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించబోమని కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కేఈఏ) తేల్చి చెప్పింది. పరీక్షల్లో బ్లూటూత్ పరికరాలు ఉపయోగించి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడే అవకాశం ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉద్యోగ నియామక బోర్డులు, కార్పొరేషన్ నియమాక పరీక్షల్లో తలను కప్పి ఉంచే అన్ని రకాల దస్తులను నిషేధిస్తున్నట్లు ఎగ్జాం బాడీ పేర్కొంది. అలాగే పరీక్షలకు హాజరయ్యే మహిళా అభ్యర్ధులు మంగళసూత్రం ధరించ వచ్చని, అలాగే కాలి మెట్టెలు కూడా ధరించవచ్చని స్పష్టం చేసింది. వివాహితులైన మహిళలు పరీక్షలకు హాజరయ్యిన సంమయంలో మంగళసూత్రాలు, కాలి మెట్టెలు, ఉంగరాలను గతంలో అనుమతించేవారు కాదు. అయితే రైట్ వింగ్ సంస్థల నిరసనల నేపథ్యంలో తాజాగా వీటిని పరీక్షా సంఘం అనుమతించింది. హిజాబీ తరహా వస్త్రాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది.
కాగా గతేడాది నుంచి కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పేర్కొన్న మార్గదర్శకాల్లో హిజాబ్ గురించి నేరుగా పేర్కొనకపోయినప్పటికీ, తల, చెవులను కప్పి ఉంచే వస్త్రాలపై నిషేధం విధించింది. దీంతో హిబాబ్‌పై కూడా నిషేధం విధించినట్లైంది. రాష్ట్రంలోని వివిధ పరీక్ష బోర్డులు, కార్పొరేషన్లు రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ఇతర ఎలాంటి ఆభరణాలు ధరించినా.. అంటే తల, చెవులు, నోటిని కప్పి ఉంచే టోపీ మాదిరి వస్త్రాలు ధరించిన వారిని పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తేల్చి చెప్పింది. పరీక్షల్లో బ్లూ టూత్ డివైజ్‌లను ఉపయోగించి మాల్ ప్రాక్టీస్‌కు (మోసాలకు) పాల్పడే వారికి చెక్ పెట్టేందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కేఈఏ) తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా అక్టోబర్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ హిజాబీ వస్త్రదారణను అనుమతించిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.