
హైదరాబాద్, ఫిబ్రవరి 21: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTU) గురువారం (ఫిబ్రవరి 20) కీలక ప్రకటన జారీ చేసింది. ఇకపై యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, కార్యాలయాలకు ప్రతి నెలా 4వ శనివారం సెలవు ఇస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. 2008కి ముందు ఉన్న సెలవు విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టినట్లు JNTU కొత్త వీసీ కిషన్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటనలో స్పష్టం చేశారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల్లోని అధికారులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజా ప్రకటన ఈ నెల 22 నుంచే అమలులోకి రానుంది.
కాగా జేఎన్టీయూ హైదరాబాద్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదు. 2008కి ముందు కూడా దీనిని అమలు చేశారు. అయితే 2008 తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ విధానాన్ని రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు దానిని పునరుద్ధరిస్తున్నట్లు యూనివర్సిటీ తన ప్రకటనలో పేర్కొంది. జేఎన్టీయే తాజా నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.