
హైదరాబాద్, అక్టోబర్ 27: జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇటీవల వెలువరించింది. తొలి విడత పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు, రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. గత ఏడాది కంటే ఈ సారి 10 రోజుల ముందుగానే జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను వెల్లడించడంతో ప్రిపరేషన్‌కు కాస్త సమయం ఎక్కువ లభించినట్లైంది. అయితే ఇప్పటి వరకు ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను మాత్రం వెల్లడించలేదు. తొలి విడత నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. అందులో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆ ప్రక్రియ కూడా ఈ నెలలోనే ప్రారంభమవనుంది. ఇక జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలకు జనవరి చివరి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని ఎన్‌టీఏ తన ప్రకటనలో పేర్కొంది. యేటా జేఈఈ మెయిన్ పేపర్ 1, 2లకు కలిపి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది దరఖాస్తు చేస్తుంటారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు లక్షన్నర మంది ఉంటారు. అయితే ఈ ఏడాది పరీక్ష కేంద్రాలు మరిన్ని పెంచాలని ఎన్టీయే నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డు, పదో తరగతి ధ్రువపత్రాల్లోని వివరాలు ఒకేలా ఉండకుంటే.. ఆ సమస్యను అధిగమించేందుకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ సమయంలో ఆప్షన్ ఇస్తామని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐటీల్లో బీటెక్ చదవాలన్నా జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. దేశవ్యాప్తంగా మొత్తం 31 ఎన్‌ఐటీలు ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) మొత్తం 24,525 సీట్లు ఉన్నాయి. ఇక 26 ట్రిపుల్‌ఐటీల్లో 9,940 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీటెక్‌లో చేరేందుకు జేఈఈ మెయిన్ పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. ఇక బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో చేరేందుకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌తో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష 300, పేపర్ 2 పరీక్ష 400 మార్కులకు ఉంటుంది.
జేఈఈ (మెయిన్) 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన అన్ని డాక్యుమెంట్లను నోటిఫికేషన్ వెలువడేనాటికి అప్‌డేట్ చేసుకోవాలని ఎన్‌టీఏ ఇప్పటికే సూచించింది. తద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా దరఖాస్తుల ప్రక్రియ సజావుగా సాగుతుంది. తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పడమేకాకుండా దరఖాస్తుల తిరస్కరణ వంటి సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చు. ముఖ్యంగా పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం ఆధార్ వివరాలు సరిగా ఉండేలా అప్‌డేట్ చేసుకోవాలి. తాజా ఫొటోగ్రాఫ్, ఇంటి అడ్రస్, తండ్రి పేరు ఆధార్ కార్డులో అప్‌డేట్ చేసుకోవాలి. దివ్యాంగ అభ్యర్థులకు యూడీఐడీ కార్డు చెల్లుబాటవుతుంది. తప్పనిసరిగా ఇది రెన్యువల్ చేయించుకొని అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. అలాగే కేటగిరీ సర్టిఫికెట్లు అంటే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-ఎన్‌సీఎల్‌లను చెల్లుబాటయ్యేలా అప్డేట్ చేసుకోవడం చాలా అవసరమని అధికారులు సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.