హైదరాబాద్, మార్చి 28: దేశవ్యాప్తంగా గల ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ జారీ అయిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో 13 పట్టణాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు ఇంజినీరింగ్ కాలేజీలు, టీసీఎస్ ఆయాన్ సెంటర్లలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలు ఏప్రిల్ 23 లేదా అంతకంటే ముందే విడుదలకానున్నాయి. దీంతో ఆ మరుసటి రోజే అంటే ఏప్రిల్ 23 నుంచి అడ్వాన్స్‌డ్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇక పరీక్ష కూడా ఇదే నెలలో ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్ రెండు సెషన్లలో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మంది మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలు రూ.1600, ఇతరులు రూ.3,200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మే 11వ తేదీన విడుదల అవుతాయి.
మే 18న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.. నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు రెండు సెషన్లకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 2న విడుదల చేస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసి సీట్లను భర్తీ చేస్తారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రస్తుతం 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్లు భర్తీ చేశారు. మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 5న నిర్వహిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.