Inspiration Story: యాచించిన చోటే కేఫ్ నడుపుతోన్న ఓ అనాథ స్ఫూర్తిధాయక కథనం.. దేదీప్యమాన ’జ్యోతి‘ కథ!
బీహార్‌లోని పాట్నాకు చెందిన ఓ అనాథ జీవితం ఎందరికో స్పూర్తి దాయకంగా నిలిచింది. విధి తనను వెక్కిరించినా.. కృంగిపోకుండా ధైర్యంగా కాలానికి ఎదురొడ్డి నిలబడింది. ఆడపిల్లనుకున్నారో.. అడ్డనుకున్నారో చిన్నతనంలోనే తల్లదండ్రులు పాట్నా రైల్వే స్టేషన్‌లో వదిలేశారు...
Orphan Girl Jyoti Inspiration Story In Telugu: బీహార్ (Bihar)లోని పాట్నాకు చెందిన ఓ అనాథ (Orphan Girl)జీవితం ఎందరికో స్పూర్తి దాయకంగా నిలిచింది. విధి తనను వెక్కిరించినా.. కృంగిపోకుండా ధైర్యంగా కాలానికి ఎదురొడ్డి నిలబడింది. ఆడపిల్లనుకున్నారో.. అడ్డనుకున్నారో చిన్నతనంలోనే తల్లదండ్రులు పాట్నా రైల్వే స్టేషన్ (Patna railway station)లో వదిలేశారు. బాల్యాన్ని భిక్షాటన (Begging) చేస్తూ ప్రారంభించింది. యాచిస్తూనే విద్యను కూడా పూర్తి చేసింది. ఐతే నేడు ఆమె యాచించిన చోటే స్థానిక నగరంలో ఓ కేఫ్ (cafeteria)ను నడుపుతోంది. ఆమె జీవన పోరట కథనమెంటో పూర్తిగా తెలుసుకుందామా..
పందొమ్మిదేళ్ల జ్యోతికి ఇప్పటి వరకు తన తల్లిదండ్రులెవరో కూడా తెలియదు. పాట్నా రైల్వే స్టేషన్‌లో తనని వదిలేసిన తర్వాత, ఓ బిచ్చమెత్తుకునే దంపతులు జ్యోతిని దత్తత తీసుకుని పెంచసాగారు. తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో కలిసి చిన్నతనంలో జ్యోతి కూడా భిక్షాటన చేయడం ప్రారంభించింది. భిక్షాటన చేసి తక్కువ డబ్బు సంపాదించిన రోజున, చెత్తను ఏరి డబ్బును సంపాదించేది. ఈ విధంగా జీవితం కొనగుతుండగా.. చదువుకోవాలనే కోరిక మాత్రం ఆమె మనస్సులో నెరవేరని కలగా మిగిలిపోయింది. బాల్యమంతా చదువు లేకుండానే గడిచిపోయింది. చదువుకోవడం ప్రారంభించినప్పటికే తన పెంపుడు తల్లిని కోల్పోయింది. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నా చదవాలనే తన కోరికను మాత్రం వదిలిపెట్టలేదు. రాంబో ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చదువుకోవడానికి పాట్నా జిల్లా యంత్రాంగం ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది.
బీహార్‌లోని రాంబో ఫౌండేషన్ హెడ్ విశాఖ కుమారి.. పాట్నాలో ఐదు కేంద్రాలు ఉన్నాయని, ఇక్కడ పేద, అనాథ బాలబాలికలకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని చెప్పారు. జ్యోతి రాంబో ఫౌండేషన్‌లో చేరిన తర్వాత, ఆమె తన చదువును కొనసాగించి మెట్రిక్యులేషన్ పరీక్షలో అసాధారణమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా, పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె ఉపేంద్ర మహారథి ఇనిస్టిట్యూట్‌లో మధుబని పెయింటింగ్స్‌లో శిక్షణ తీసుకుని, పెయింటింగ్ వేయడం కూడా నేర్చుకుంది.
ఐతే ఇంతటితో జ్యోతి సంతృప్తి చెందలేదు. తన అభిరుచికి తగ్గట్టు ఒక సంస్థలో కేఫ్ నడిపే ఉద్యోగం వచ్చింది. రోజంతా కేఫ్ నడిపి, ఖాళీ సమయాల్లో ఓపెన్ స్కూల్ లెర్నింగ్ ద్వారా చదువుకుంటోంది. నేడు జ్యోతి తన సొంత సంపాదనతో అద్దె ఇంట్లో ఉంటోంది. మార్కెటింగ్ రంగంలో కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని కలలు కంటోంది. ఇదీ జ్యోతి కథ. ఇది కథ కాదు ఓ ఒంటరి ఆడపిల్ల గెలుపు. తన అప్రతిహత ధైర్యం ముందు విధి ఓడిపోయిందనే చెప్పవచ్చు. ఆమె అలుపెరుగని కృషి ఫలించాలని మనమందరం కోరుకుందాం..
Also Read: