JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ (JEE) అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూలు ఖరారైంది.
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ (JEE) అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూలు ఖరారైంది. ఈ పరీక్ష ద్వారా దేశంలోని 23 ఐఐటీల్లోని సుమారు 17వేల సీట్లను భర్తీ చేయనున్నారు. కాగా ఈ ఏడాది ఐఐటీ బాంబే (IIT Bombay) ఈ ప్రతిష్ఠాత్మక పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి.. సిలబస్‌ను కూడా ఖరారు చేసింది. తాజాగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. కాగా జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అర్హత ఉంటుంది. జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను రెండు, మూడు రోజుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించే అవకాశం ఉంది. కాగా గతేడాది నాలుగుసార్లు జేఈఈ మెయిన్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సమయం లేకపోవడంతో రెండుసార్లే పరీక్షలు జరపాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. ఏప్రిల్, మే నెలల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయని తెలుస్తోంది.
ఇక అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ విషయానికొస్తే..
*జూన్ 8 నుంచి 14 వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది. *జూన్ 27 నుంచి వెబ్ అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. *జులై 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్2 పరీక్ష జరుగుతుంది. * జులై 7న రెస్పాన్స్ షీట్లు విడుదల చేస్తారు. *జులై 9న ప్రాథమిక సమాధానాల కీ విడుదల చేసి.. 10వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. * జులై 18న ఫైనల్ కీతో పాటు ఫలితాలను ప్రకటించనున్నారు.
*ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు కోసం జులై 18, 19తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు.
*జులై 21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు జరుగుతుంది.
* జులై 24న తుది ఫలితాలను ప్రకటిస్తారు.
కాగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం జులై 19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఐటీ బాంబే తెలిపింది.
Russia Ukraine Crisis: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..
Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..