అమరావతి, నవంబర్ 25: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది. సుమారు 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ జనవరి సెషన్‌కు అక్టోబర్ 28 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనా.. మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. దీంతో ఈ సారి జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. అప్లికేషన్‌లో తీసుకొచ్చిన కొత్త విధానాలు, అర్హత ప్రమాణాలు విద్యార్ధులను గందరగోళానికి గురిచేసింది. ముఖ్యంగా దరఖాస్తు సమయంలో కొన్ని ప్రత్యేక సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సి రావడంతో అప్పటికప్పుడు అవి దొరక్క విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
అయినప్పటికీ నవంబర్ 22వ తేదీన గడువు సమయం ముగిసే నాటికి దాదాపు 13.8లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత ఏడాదితో పోల్చితే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ఇంకా ప్రకటించలేదు. కాగా జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్ పరీక్షలు, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు ఇప్పటికే ఎన్టీఏ షెడ్యూల్ ప్రకటించింది. జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2020 కోవిడ్ సమయంలో జేఈఈ మెయిన్ పరీక్షల్లోని సెక్షన్ బీలో ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తీసుకురాగా.. ఈ సారి నుంచి దానిని తొలగించింది. దీంతో సెక్షన్ బీలో ప్రతి సబ్జెక్టులో 10 ప్రశ్నలకు బదులు 5 ప్రశ్నలే ఉండనున్నాయి. అలాగే న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే వీటికి కూడా ప్రతి తప్పు ప్రశ్నకు మార్కుల కోత ఉంటుంది. ఇక వయోపరిమితిలోనూ సడలింపులు తీసుకువచ్చింది. 12వ తరగతి విద్యా అర్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ పరీక్షా నగరాలను సైతం 300 నుంచి 284కి తగ్గించారు. ఇతర దేశాల్లో పరీక్ష కేంద్రాలను 24 నుంచి 14 కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ దేశాల్లో పరీక్ష కేంద్రాలను పూర్తిగా తొలగించింది. బదులుగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, ఏయూఈలలో కొత్తగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది.