హైదరాబాద్, ఆగస్టు 30: తెలంగాణ గ్రూప్ 1 పోస్టుల భర్తీ వ్యవహారంలో రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు టీజీపీఎస్సీకి, ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్ల అమలు చేస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబరు 27వ తేదీకి వాయిదా వేసింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 55కు సవరణ తీసుకువస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ను సవాలు చేస్తూ.. ఎం హనుమాన్‌తోపాటు మరో ముగ్గురు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని విచారించిన జస్టిస్ కె శరత్ ఇరువర్గాల వాదనలు విన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని అన్నారు. మొత్తం 563 పోస్టులకు జనరల్ కేటగిరీలో 209, ఈడబ్ల్యూఎస్ 49, బీసీ(ఏ) 44, బీసీ (బీ)37, బీసీ(సీ) 13, బీసీ(డీ) 22, బీసీ(ఈ) 16, ఎస్సీ 93, ఎస్టీ 52, క్రీడాకారులు 4, దివ్యాంగులు 24 పోస్టులు చొప్పున ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి కేటగిరీలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీజీపీఎస్సీ నిబంధనలు పాటించలేదని వ్యాఖ్యానించారు. తద్వారా రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని కోర్టుకు వివరించారు. కొన్ని విభాగాల్లో 1:50 నిష్పత్తి దాటిందని పేర్కొన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయమూర్తికి వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను విన్న న్యాయమూర్తి వివరణ కోరుతూ ప్రభుత్వానికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ ఎయిడెడ్/ ప్రైవేటు అన్ఎయిడెడ్/ అటానమస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో చేపట్టిన ప్రవేశాల రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 మధ్య సీటు కేటాయించిన సంబంధిత కాలేజీలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్’ ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో రెండో దశ డిగ్రీ సీట్ల కేటాయింపు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.