హైదరాబాద్, జులై 16: తెలంగాణ రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో జులై 14 (ఆదివారం) అసిస్టెంట్ ఇంజినీర్స్, కెమిస్ట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పలువురు అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బందుల పాలయ్యారు. ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఉదయమే కేంద్రానికి వచ్చినవారికి జెన్‌కో ముచ్చెమటలు పట్టించింది. మొత్తం రెండు సెషన్లలో పరీక్ష జరగగా హైదరాబాద్‌లోని ఓ సెంటర్‌లో ఏకంగా 80 మందికి రూమ్ నంబర్ కేటాయించపోవడం చర్చనీయాంశంగా మారింది.
వరంగల్‌కు చెందిన డీఎస్ అరుణ్ అనే అభ్యర్ధి జులై 14న జెన్‌కో పరీక్ష రాసేందుకు మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు పరీక్ష ఉండగా ఉదయం 10.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. మధ్యాహ్నం సెషన్‌కు అభ్యర్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించగా.. అభ్యర్ధులందరూ తమ హాల్ టికెట్ నంబర్‌లను చూసుకుని, తమ తమ గదుల్లోకి వెళ్లిపోతున్నారు. అయితే అరుణ్ మాత్రం బోర్డులో తన నంబర్ కనిపించలేదు. బోర్డులో తన హాల్‌టికెట్ నంబర్ కోసం వెతకగా కనిపించలేదు.
అలాగే తన ముందు, వెనకాల ఉన్న దాదాపు 80 మందికి సంబంధించిన నంబర్లు లేనట్లు గుర్తించారు. దీంతో వెంటనే అక్కడి పరీక్షల నిర్వహణ అధికారికి ఈ విషయాన్ని తెలిపారు. అయినా వారెవరూ స్పందించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక వెంటనే హెల్ప్‌డెస్క్ ద్వారా జెన్‌కో ఉన్నతాధికారిని సంప్రదించారు. ఈ సమస్యను సంబంధిత పరీక్ష కేంద్రం వాళ్లే పరిష్కరిస్తారని చెప్పడంతో, మళ్లీ పరీక్ష నిర్వహణ అధికారులను కలిశారు. అప్పటికే పలువురు అభ్యర్ధులు తమ హాల్‌టికెట్ నంబర్లు లేవంటూ ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే బోర్డు ఫొటోలు పోస్టు చేయడంతో అది నిమిషాల వ్యవధిలో వైరల్ అయ్యింది. అంతే వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 5 నిమిషాల్లో పరీక్ష మొదలవుతుందనగా గది ఏర్పాటు చేసేందుకు యత్నించారు. చివరకు అతికష్టం మీద అనేక గదులు మారిన తర్వాత పరీక్ష రాసేందుకు అనుమతిచ్చారని, ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు వెళ్తే ముప్పుతిప్పలు పెట్టారంటూ అరుణ్ మీడియాకు తన గోడు విన్నవించాడు.