
విజయవాడలోని డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాత పరీక్షలో వచ్చిన సీట్ల ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, నాన్ మైనారిటీ, మైనారిటీ నర్సింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు జూన్ 20, 2025వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.
బీఎస్సీ నర్సింగ్ (నాలుగేళ్లు) కోర్సులో మొత్తం 13,726 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపులో లేదంటే 12వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అయితే సైన్స్ గ్రూపుతోపాటు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చదివి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి డిసెంబర్ 31, 2025 నాటికి 17ఏళ్లు నిండి ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 20, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.1180, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.944 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష జులై 7న నిర్వహించనున్నారు.
రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. 2 గంటల పాటు పరీక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్ బైపీసీ సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. నర్సింగ్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి 20 ప్రశ్నల చొప్పున ఇస్తారు. రాత పరీక్ష ఇంగ్లిష్, తెలుగు మాధ్యమంలో ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.