Agnipath Recruitment Rally: త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ స్కీమ్ (Agnipath Scheme) ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎయిర్‌ఫోర్స్, నేవీల్లో ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత ఆర్మీ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కూడా అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Agnipath Recruitment Rally) నిర్వహించనున్నారు. విశాఖపట్నం వేదికగా నిర్వహించే ఈ రిక్రూట్‌మెంట్‌లో ఏపీలోని 13 జిల్లాల అభ్యర్థులతో పాటు యానాంకు చెందిన యువత పాల్గొనవచ్చు. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరుల సెలెక్షన్‌ను నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల వారికి..
ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళలం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 30వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రక్షణ శాఖ అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర అంశాలకు సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలుంటే.. 0891-2756959, 0891-2754680 నంబర్లను సంప్రదించాలని సూచించారు. దీంతో పాటు ఆర్మీ కాలింగ్ మొబైల్ యాప్ ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..