Free Coaching for Constable Jobs: తెలుగు రాష్ట్రాల్లో కానిస్టేబుల్‌ కొలువులకు ఉచిత కోచింగ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి

|

Dec 10, 2024 | 4:09 PM

సర్కార్ కొలువు దక్కించుకోవాలనేది ఎందరికో కల. కానీ కొందరికే అది సాధ్యం అవుతుంది. ఇందుకు గల అనేకానేక కారణాల్లో ఆర్ధిక ఇబ్బందులు ఒకటి. అయితే ఒక్క రూపాయి చెల్లించకుండా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ త్వరలోనే నిర్వహించనున్న కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు ఎవరైనా ఇక్కడ ఉచితంగా శిక్షణ పొందవచ్చు..

Free Coaching for Constable Jobs: తెలుగు రాష్ట్రాల్లో కానిస్టేబుల్‌ కొలువులకు ఉచిత కోచింగ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి
Free Coaching For Constable Jobs
Follow us on

గుంటూరు, డిసెంబర్‌ 10: కేంద్ర సాయుధ బలగాల్లో బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. అంటే పరీక్షలకు సుమారుగా 2 నెలల సమయం ఉంది. కొందరు కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టి శిక్షణ తీసుకుంటుంటే.. స్థోమతలేని నిరుపేద అభ్యర్ధులు ఇంటి వద్దే సొంత ప్రిపరేషన్ సాగిస్తున్నారు. ఇటువంటి వారికి కానిస్టేబుల్‌ కొలువు కల సాకారం చేసుకునేందుకు ఉచిత కోచింగ్ కోసం పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్, రామ్‌కీ ఫౌండేషన్‌ ముందుకు వచ్చాయి.

ఇందుకోసం పోటీ పరీక్షల శిక్షణనిచ్చే శ్రీధర్‌ సీసీఈ సెంటర్‌తో కలిసి ఈ రెండు ఫౌండేషన్లు సంయుక్తంగా అర్హత పరీక్ష నిర్వహించనున్నాయి. ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిలో మెరిట్‌ ఆధారంగా 250 మందిని ఎంపిక చేసి, గుంటూరు జిల్లా పెదపరిమి (అమరావతి) గ్రామంలోని రాంకీ ఫౌండేషన్‌ స్కిల్‌ సెంటర్‌లో కోచింగ్‌ ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 22న తెలుగు రాష్ట్రాల్లోని సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఈ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 25న ఫలితాలు ప్రకటిస్తారు. ఇక డిసెంబర్‌ 28 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఎంపికైన వారికి ఉచితంగా వసతి, భోజనం, స్టడీ మెటీరియల్‌తో పాటు ఆన్‌లైన్‌ మోడల్‌ పరీక్షలు సైతం నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నారు. ఇతర పూర్తి వివరాలకు 7337585959, 9000797789 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్ధులు ఎవరైనా ఉచిత కోచింగ్‌కు పోటీ పడవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4- 25 తేదీల్లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే రాత పరీక్షకు ఉచితంగా శిక్షణ పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.